నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మహిళల్ని కించపరుస్తూ మాట్లడితే ఊరుకునేది లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు హెచ్చరించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై వ్యక్తగతంగా ఆరోపణలు చేస్తూ.. కాల్చి పడేస్తానని వ్యక్తిగత బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. మర్రి జనార్దన్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడతున్నారని సునీతా రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు మహిళలను కించపరుస్తూ మాట్లాడటం అలవాటైపోయిందని ఆమె విమర్శించారు.
మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న సునీతా రావు.. అందుకే బతుకమ్మ బోనాలు, హారతులు పట్టుకువస్తే డబ్బులు ఇస్తానని దండోరాలు వేయించారని ఎద్దేవా చేశారు. రాజకీయ నేతలు మహిళలను అగౌరవ పరిస్తే.. ఎన్నికల్లో వారి సీట్లు సునామీలో కొట్టుకుపోతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్న కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు.. లేకుంటే వారు రాజకీయాల్లో ఇమడలేరని సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన సునీతా రావు.. మహిళల రిజర్వేషన్‌ల గురించి మాట్లాడిన కవిత.. మహిళలను, బతుకమ్మలను అవమాన పరుస్తున్న సొంత ఎమ్మెల్యేకు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
బీఆర్ఎస్ నేతలు బయటకు మాత్రమే తాము అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నాము, అందరికీ మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతున్న వారిపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యాంగం అములవుతున్న తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఎవరిని ఏమన్నా నడుస్తుందన్న ఆమె.. సామాన్యలు మాత్రం ప్రశ్నిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. మర్రి జనార్దన్ రెడ్డి నోటి దూలే అతని ఓటమికి కారణం అవుతుందని స్పష్టం చేశారు.