2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి మంగళవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలసిందే. వ్యవసాయం, ఉపాధికల్పన, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధి, తర్వాతితరం సంస్కరణలు వంటి తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలకు మోదీ ప్రభుత్వం పెద్ద పీఠ వేసింది.
వాస్తవానికి ఏపీ, బిహార్.. ఈ రెండు రాష్ట్రాలు కూడా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కూడా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల వ్యవహారంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించింది. ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పిన మోదీ సర్కార్.. బడ్జెట్‌లో మాత్రం అధిక కేటాయింపులు చేసింది.
అమరావతికి రూ.15 వేల కోట్లు
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్రం.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక ఏడాదిలోనే అందిస్తామని పేర్కొంది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం నీటి, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్‌లు ఇస్తామని పేర్కొంది. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.
బిహార్‌కు సాయం
బిహార్‌లో రహదారుల అభివృద్ధి కోసం మోదీ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.26 వేల కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇందులో జాతీయ రహదారులు కోసమే రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. పట్నా - పుర్నియాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి చేస్తామని.. అలాగే బక్సర్ - భాగల్‌పుర్, బోధ్‌గయా-రాజ్‌గిర్-వైశాలీ-దర్భంగాలను అనుసంధానం చేస్తామని ప్రకటించింది. బక్సర్ జిల్లాలో గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణం, భాగల్‌పుర్‌లోని పిర్‌పౌంతీలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది. వీటితో పాటు రూ.21 వేల కోట్లతో వివిధ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయింపులు చేస్తామని చెప్పింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు రూ.11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే పర్యటక కేంద్రంగా నలందాను అభివృద్ధి చేయడం, ఎయిర్‌పోర్టులు, వైద్య కళాశాలలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించింది.
బిహార్‌కి బడ్జెట్ కేటాయింపులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. తమ రాష్ట్రానికి మెగా బొనాంజా ఇవ్వడాన్ని స్వాగతించారు. బిహార్‌కు స్పెషల్ స్టేషన్ అయినా లేదా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కేంద్రానికి నిరంతరం చెబుతూనే ఉన్నానని తెలిపారు. చివరికి వారు రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సాయం చేయడం కూడా ప్రారంభమైందని తెలిపారు.