Medaram Sammakka Sarakka Jathara Second Day: తెలంగాణ మేడారం జాతర చాలా ఫేమస్. అక్కచెల్లెళ్ళుగా చెప్పుకునే వనదేవతలు సమ్మక్క- సారలమ్మ జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ అని చెబుతారు. దీని కోసం చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు. ఈసారి మొదటి రోజు నుంచే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే నేడు జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమవనున్నది. ఈరోజు కుంకుమ భరిణి రూపంలో ఉండే సమ్మక్కను (Sammakka) మేడారం తీసుకువచ్చి గద్దె మీద ప్రతిష్టించనున్నారు. ప్రభుత్వం తరుఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క (MLA Seethakka) సమ్మక్కకు ఆహ్వానం పలకనున్నారు. సమ్మక్కను తీసుకువస్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్..ఇతర పోలీసులు బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతారు.
తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు...
ఈసారి మేడారం జాతరకు ఎప్పుడూ కంటే ఎక్కువగా భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జాతర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. ఎక్కడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసింది. మేడారానికి చేరుకోవడానికి రైళ్ళు, బస్సులు, హెలికాఫ్టర్లను సైతం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. దీంతో భక్తులు మేడారానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఈ నెల 24 వరకు జాతర...
మేడారం జాతర నిన్న అంటే 21వ తేదీన మొదలైంది. ఇది మరో మూడు రోజుల పాటూ అనగా ఫిబ్రవరి 24వరకు కొనసాగనుంది. నిన్న రాత్రి సారలమ్మతో (Sarakka) పాటూ పడిగిద్ద రాజు (Pagididda Raju), గోవిందరాజులు గద్దె మీద కొలువు దీరారు. నిన్న సాయంత్రం 6 గంటలకు పసుపు, కుంకుమ భరణి రూపంలో సారలమ్మను ఊరేగింపుగా తీసుకొని మేడారానికి తరలిచ్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మంగళవారమే బయలుదేరి బుధవారం అర్ధరాత్రికి మేడారానికి చేరుకున్నారు. అలాగే ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం మండలంలోని కన్నాయి గూడెం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజులును గిరిజన పూజారులు బుధవారం రాత్రి గద్దె మీదకు చేర్చారు.
తరలిరానున్న ప్రముఖులు..
మేడారం జాతరకు ప్రముఖులు అందరూ తరలి రానున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు వనదేవతలను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతితో పాటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ (CM Revanth Reddy) కూడా రేపే అమ్మలను దర్శించుకోనున్నారు. జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని సర్కారు అంచనా వేస్తోంది. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పర్యవేక్షిస్తున్నారు. మేడారంలోనే ఉంటూ తక్షణ చర్యలను తీసుకుంటున్నారు.
Also Read:Andhra Pradesh: ఏపీలో టెన్షన్ టెన్షన్..ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్