Congress: కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్‌ రెడ్డి సవాల్‌..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ నుంచే తాను ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న రేవంత్.. నియోజకవర్గం అభివృద్ధే తన తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బెదిరింపులకు తమ కార్యకర్తలు ఎవరూ బెదరబోరన్నారు.

Congress: కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్‌ రెడ్డి సవాల్‌..
New Update

తెలంగాణలో ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సమరానికి సై అంటూ దూసుకుపోతున్న వేళ.. కాంగ్రెస్‌ సైతం తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఓవైపు ఎమ్మెల్యే టికెట్ల కోసం హస్తం పార్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ (KCR) గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా రేవంత్ రెడ్డి సైతం తాను కొడంగల్‌ నుంచి మాత్రమే దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ కొడంగల్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌ బెదిరింపులకు తమ నాయకులెవరు బెదరబోరన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తనను కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కోరారని.. తనను గెలిపించుకునే బాధ్యత నియోజకవర్గ ప్రజలదేనంటూ హామీ ఇచ్చారని రేవంత్‌ (Revanth) తెలిపారు. దీంతో కేవలం కొడంగల్‌ నుంచే తాను దరఖాస్తు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రేవంత్‌ మల్కజ్‌గిరి లేదా హైదరాబాద్‌ సిటీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. కాని అనూహ్యాంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్‌.. నియోజకవర్గ ప్రజలను మోసం చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్‌ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. హైదారాబాద్‌- బీజాపూర్‌ హైవే తీసుకొచ్చింది తానేనన్నారు. కొడంగల్‌లో జరిగిన ప్రతి అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందన్నారు. నియోజకవర్గానికి తాగునీరు తెచ్చి ప్రజల దాహర్తి తీర్చింది తానే అని, డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాలను తీసుకొచ్చింది నేనేనంటూ రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌వి కేవతం మాటలు మాత్రమేనని, నియోజకవర్గానికి తండ్రి,కొడుకులు చేసిందేమి లేదన్నారు.

కృష్ణా జలాలు తెచ్చారా..

రెండు సంవత్సరాల్లో కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్‌ ప్రజల కాళ్లు కడుగుతామన్న కేసీఆర్‌.. ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావన్నారు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను నిర్మించలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందన్నారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోందని, ఇక్కడి ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ వాళ్లపై దాడి చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారని, తాము గాంధీలము కాదని, చేతితో కొడితే తాము చెప్పులతో కొడతామని హెచ్చరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచి కొడంగల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ విధానమని రేవంత్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం తమ పార్టీ విధానమని రేవంత్‌ పేర్కొన్నారు. ఇవాళ వంట గ్యాస్‌ కొనాలంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్‌ బండ అందిస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్‌ను గెలిపించుకుంటాం: గురునాథరెడ్డి

రేవంత్‌రెడ్డిని కొడంగ‌ల్ నుంచి భారీ అధిక్యంతో గెలిపించుకుంటామ‌ని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ని గెలిపించే బాధ్యత నియోజకవర్గ ప్రజలంతా తీసుకుంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చార‌ని, ఈ సారి కొడంగల్ కాంగ్రెస్ దేన‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే కొట్టాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అంటున్నారని, ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాల‌ని హిత‌వు పలికారు. లేదంటే ప్రజలే తిరగబడతారన్నారు.

తాండూరు, వికారాబాద్‌లో రేవంత్‌

కొడంగల్‌ పర్యటన ముగించుకున్న రేవంత్‌ తాండూరు, వికారాబాద్ వెళ్లారు. తాండూరు గడ్డ కాంగ్రెస్ కు కంచుకోట అని కార్యకర్తలు నిరూపించారన్నారు. పార్టీ జెండా కింద గెలిచి కొంతమంది అమ్ముడుపోయినా.. కార్యకర్తలు పార్టీని కాపాడుకున్నారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఏమిచ్చినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనన్నారు. ఓకాయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటానంటే నాలుగేళ్లు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం అతడికి మంత్రి పదవి ఇస్తున్నారని పట్నం మహేందర్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రుణమాఫీతో రైతులను కేసీఆర్‌ మెసం చేస్తున్నారని, ఆయన ఇచ్చిన పైసలు మిత్తికే సరిపోతాయని ఎద్దెవా చేశారు.

మరిన్ని వార్తల కోసం చూడండి..

#telangana #ktr #brs #cm-kcr #revanth-reddy #congress #revanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి