భారతీయుల కలలను చెరిపేస్తూ ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ ను తీసుకెళ్ళిపోయింది. టోర్నీ ఆరంభంలో తడబడినా...ఫైనల్స్ లో మాత్రం తమను ఢీకొట్టేవాడు ఎవడూ లేడని కంగారూలు మరోసారి నిరూపించారు. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
కోట్ల మంది హృదయాలు ముక్కలయ్యాయి. ఆశలు అడియాశలు అయ్యాయి. ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు ఫైనల్లో ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దాంతో పాటూ అద్భుతమైన క్యాచ్ పట్టి ఇండియాకు అడ్డకట్టవేయడమే కాక ఈ రోజు అత్యధిక పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను ఎగరేసుకుపోయాడు.
పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం చేసేసాడు. లక్షా ముప్పై వేల గుండెలు బద్దలు కొట్టాడు. ఎక్కడ ఆడినా తమకు తిరుగు లేదని మరోసారి నిరూపించారు. ఆరోసారి సగర్వంగా కప్పును అందుకుని ఆనందంలో మునిగితేలుతున్నారు ఆస్ట్రేలియన్లు.