Telangana : వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర(Vikasit Bharat Sankalp Yatra) లో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) దేశంలో పలువురిలోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో గవర్నమెంట్ ద్వారా లబ్ది పొందుతున్న వారితో ప్రధాని సంభాషించారు. అలా మాట్లాడిన వారిలో మన తెలంగాణ(Telangana) కు చెందిన మల్లిఖార్జున్ కూడా ఉన్నారు. కరీంనగర్ చొప్పదండి మండలం పెద్ద కూర్మపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో ముచ్చటించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగంలో వారు చేస్తున్న కృషిని కొనియాడారు ప్రధాని మోడీ. మల్లికార్జున్ రెడ్డికి తోడుగా నిలిచి, అతని ఆశయాలకు తోడ్పాటు ఇస్తున్నందుకు అతని భార్యను కూడా ప్రత్యేకంగా పిలిచి మరీ పొగిడారు మోడీ.
Also Read:దారుణం.. సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు మృతి..
రైతులకు స్ఫూర్తి అన్న ప్రధాని..
మల్లికార్జున్(Mallikarjun) చేస్తున్న పనిని మెచ్చుకున్నారు ప్రధాని మోడీ. విద్యావంతులైన వారు వ్యవసాయంలోకి రావడం చాలా హర్షణీయం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలకు మల్లికార్జున్ వంటివారు బలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో మార్గదర్శకంగా నిలవాలన్నారు. విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సమీకృత వ్యవసాయం మీద యూనివర్శిటీల్లో గెస్ట్ లెక్చర్ ఇవ్వాలని మల్లికార్జున్‌ను కోరారు ప్రధాని. మీలాంటి వారు మాట్లాడితే యువతకు స్ఫూర్తి వస్తుందని చెప్పారు. అదే సమయంలో మల్లికార్జున్ ఏఏ ప్రభుత్వ పథకాలను పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అతనికి వాటి గురించి వివరించారు.
బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన మల్లికార్జెన్ రెడ్డి..
కరీంనగర్(Karimnagar) కు చెందిన మల్లికార్జున్ ఉన్నత విద్య అభ్యసించి..మంచి ఉద్యోగం కూడా చేసారు. కానీ వాటిని వదిలిపెట్టి తన స్వగ్రాయం వచ్చేసి ఇప్పడు వ్యవసాయం చేసుకుంటున్నారు. పర్యావరణహిత పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అక్కద అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను ఈ రకమైన వ్యవసాయం చేయడానికి, ఎదగడానికి తన విద్య ఎంతగానో ఉపయోగపడిందని చెబుతున్నారు మల్లికార్జున్. సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సమీకృత, పర్యావరణహిత వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న తన ఆదాయం రూ.12 లక్షలకు పెరిగిందని తెలిపారు.తనలాగే మరింత మంది చదువుకున్న యువత వ్యవసాయంలోకి రావాలని అంటున్నారు. మల్లికార్జున్ కేవలం వ్యవసాయమే కాకుండా చేపల పెంపకం, పశువుల పెంపకం వంటివి కూడా చేస్తున్నారు. ఇతని భార్య కూడా ఎంబీయే చదువుకున్నారు. మల్లికార్జున్ చేసే ప్రతీ పనిలోనూ ఆయన బార్య, తండ్రి సహాయసహకారాలు అందిస్తున్నారు.
ప్రధానితో మాట్లాడ్డం ఎప్పటికీ మరిచిపోలేను..
దేశ ప్రధానితో స్వయంగా మాట్లాడ్డం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని విషయంగా ఉంటుందని మల్లికార్జున్ రెడ్డి అంటున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తనకు ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ఇక ప్రధాని నన్ను ఉద్దేశించి నారీశక్తి అని ప్రశంసించడం మర్చిపోలేని గుర్తింపని ఆనందంగా చెబుతున్నారు మల్లికార్జున్ భార్య సంధ్య. తమకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి పూర్తిగా తెలియదని...ప్రధానితో మాట్లాడ్డం వల్ల తెలుసుకోగలిగామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందీ!