రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో మొదటి విడతలో ఐదు వందల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారన్న ఆయన.. అనంతరం రెండో విడతలో మరో వంద మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చారన్నారు. కాగా ప్రస్తుతం మూడో విడతలో 1500 మందికి ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని రాజాసింగ్ విమర్శించారు.
గతంలో దూల్ పేటలో నివసించే పేదలు గుడుంబా అమ్ముకొని జీవనం సాగిస్తుండేవారని గోషామహల్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కానీ బీఆర్‌ఎస్ సర్కార్ గుడుంబాను పూర్తిగా నిషేధించడంతో పేదవారు ఉపాధి కోల్పోయ్యారన్నారు. అంతే కాకుండా వారిపై పీడీ యాక్ట్, గుండా యాక్ట్‌లు పెట్టి గుండుంబాను బంద్ చేయించారన్న ఆయన.. ఇప్పటి వరకు వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించలేదన్నారు. దూల్‌పేట ప్రజలకు రియాబిలిటేషన్ చూపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారని రాజాసింగ్ గుర్తు చేశారు.
తాను సైతం అనేకసార్లు ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించానని రాజాసింగ్ గుర్తు చేశారు. దూల్‌పేట వచ్చి అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 1500 ఇళ్లలో గుడుంబా వృత్తిని మానేసిన వారిని గుర్తించి వారికి రియాబిలిటేషన్ కింద ఇండ్లు ప్రకటించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అర్హులైన వారికి కాకుండా వేరే వారికి ఇళ్లు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలన్న ఆయన.. బీఆర్‌ఎస్ నేతలు వారి కార్యకర్తలకు ఇళ్లు ఇస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.