NDA : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ(BJP) ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు కీలక నేతలు ఆ కూటమి నుంచి బయటకు రావడం చర్చనీయమవుతోంది. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తామని ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇండియా కూటమిని వీడనున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ ఎన్డీఏ గూటికి..!
త్వరలోనే నితీశ్ కుమార్ NDA కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మరో రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం బయటపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. జేడీయూ నేత అయిన నితీశ్ కుమార్(Nitish Kumar) ఏ కూటమిలో కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. చివరికి మళ్లీ తన పాత మిత్రుల వైపే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇండియా కూటమితో ఆర్జేడీ పార్టీకి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే నితిశ్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..?
మోదీతో కలవనున్న నితీశ్
అంతేకాదు త్వరలేనే ప్రధాని మోదీ(PM Modi) తో కలిసి నితీశ్ కుమార్ వేదిక పంచుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న బిహార్‌లోని బెట్టియాలో ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో నితిశ్ కుమార్ ప్రధాని మోదీతో కలిసి పాల్గొనబోతున్నారనేది తెలుస్తోంది. జేడీయూ కార్యకర్తలకు కూడా బెట్టియా వద్దకు చేరుకోవాలని వారికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే నితీశ్ మళ్లీ బీజేపీ వైపు రావడం గురించి పలువురు బీజేపీ నేతలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలు కలగజేసుకుని నితీశ్‌ను ఏమి అనొద్దని అన్నట్లు తెలుస్తుంది.
మరో విషయం ఏంటంటే నితీశ్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఇది 5వ సారి. ఆయన 2013 నుంచి కూడా ఆర్జేడీ-కాంగ్రెస్ – లెఫ్ట్ పార్టీల కూటమితో కొనసాగారు. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నితీశ్ విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్డీఏలోకి వెళ్లి.. 2020లో అధికారం చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా కూటమితో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఆయన మళ్లీ ఎన్డీఏ కూటమితో కలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ