Nipah virus mortality rate very high than Covid-19: కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇది బంగ్లాదేశ్ వేరియంట్ అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి (Veena George) తెలిపారు. ఇక్కడ రోజుకో నిపా వైరస్ కేసు బయటపడుతోంది. ఇది తొందరగా వ్యాప్తి చెందకపోయినా మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాలో (kozikode) ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ హై అలర్ట్ ను విధించారు. దాంతో పాటూ అటవీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు కోవిడ్ కన్నా నిపా వైరస్ ప్రమాదకరం అంటున్నారు ఐసీఎంఆర్ (ICMR) ఛీఫ్ డాక్టర్ రాజీవ్ బాహల్. కోవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్ టైమ్ లో మరణాల శాతం 2-3 ఉంటే...నిపా సోకిన వారిలో మరణాల రేటు 40-70 శాతం మధ్య ఉందని అన్నారు.నిపా ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం 20 డోసుల మోనోకలోనల్ యాంటీబాడీస్ సరఫరా చేయాలని ఆస్ట్రేలియాను భారత్ కోరింది. వీటి వల్ల ఇతర దేశాల్లో నిపా వైరస్ సోకిన వారిలో 14 మంది కోలుకున్నారని బాహల్ చెబుతున్నారు.
కోజికోడ్ జిల్లాలో లాక్ డౌన్ విధించారు. చాలా అవసరమైతే తప్ప ఇళ్ళల్లోంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరించారు. సూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు నిపా వైరస్ సోకిన వారి కాంటాక్ట్ లిస్ట్ 1080కి పెరిగిందని కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 327మంది హెల్త్ వర్కర్లే ఉండడం ఆందోళనకరంగా మారిందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ వీరిలో ఎలాంటి లక్షణాలు కనబడలేదని అదొక్కటే మంచి విషయమని అంటున్నారు.