ప్రతీ ఏడాది రాజకీయాలు మారిపోతూ ఉంటాయి. కొందరు నేతలు ఎదుగుతుంటారు. మరికొందరి నాయకుల గ్రాఫ్ పడిపోతుంది. ఈ సంవత్సరం కూడా కొంతమంది నేతలకు కలిసొచ్చింది. మరికొందరికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఈసారి జరిగిన లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పలువురి నేతల రాజకీయ భవిష్యత్తును మలుపుతిప్పాయి. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం.
శరద్ పవార్
మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కీలక నేత. కానీ ఈ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయిన సంగతి తెలిసిందే. ఎన్పీపీలో అజిత్ పవార్ ఒక వర్గం కాగా.. మరో వర్గం శరద్ పవార్‌ది. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి, మహాయుతి కుటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. కానీ మహావికాస్ అఘాడి కూటమి ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ.. 10 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 86 స్థానాల్లో పోటీ చేసి కేవలం10 స్థానాల్లోనే గెలిచింది. దీంతో ఎన్సీపీ (శరద్ పవర్) పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. మామ, మేనల్లుడు(అజిత్ పవార్)కు జరిగిన పోరులో మేనల్లుడే గెలిచాడు. గతంలో నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన శరద్ పవార్ రాజకీయ పలుకుబడి ఇప్పుడు దారుణంగా పడిపోయింది.
ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉద్ధవ్ ఠాక్రేకు కూడా కలిసిరాలేదు. 2022లో శివసేన విడిపోవడంతో ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఉద్ధవ్.. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గంపై పోరాడుతూనే ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే) వర్గం ఘోరంగా ఓడిపోయింది. మహా వికాస్ అఘాడిలో సీఎం పదవిపై కూడా ఎన్నికలకు ముందే విభేదాలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రేకు ఈసారి ఏం కలిసిరాలేదని చెప్పొచ్చు.
మాయావతి
ఉత్తరప్రదేశ్‌కు గతంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీఎస్పీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 స్థానాల్లో గెలిచింది. కానీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దళితుల ఓట్ షేరింగ్ బీజేపీ వైపు వెళ్లిపోవడంతోనే బీఎస్పీకీ కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మాయావతి రాజకీయ పరిస్థితి ఇప్పుడు దారుణంగా పడిపోయింది
నవీన్ పట్నాయక్
2000 నుంచి 2024 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్ పట్నాయక్ పాలనకు ఈసారి బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (BJD) పార్టీ ఓడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. నవీన్ పట్నాయక్ వయసు ప్రస్తుతం 78 ఏళ్లు. దీంతో ఆయన రాజకీయాల్లో ఇక యాక్టివ్‌గా ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. 24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్‌కు ఈ ఏడాది బిగ్ షాక్ ఇచ్చినట్లయ్యింది.
మెహబూబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్‌కు గతంలో సీఎంగా పనిచేసిన మెహబూబా ముఫ్తీకి కూడా ఈ ఏడాది కలిసి రాలేదు. పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ జగన్‌కు బిగ్ షాకిచ్చాయి. 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో బంఫర్ విక్టరీ సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది. ఇంత తక్కువ సీట్లు రావడంతో కనీసం విపక్ష హోదా కూడా లేకుండా పోయింది. జగన్ రాజకీయంగా కోలుకునేందుకు ఇంకా చాలాకాలం పట్టొచ్చు.