‘పాకిస్థాన్ ఉగ్రవాదిని కలిస్తే.. భారత్ మాజీ ప్రధాని ప్రసంశలు’

జమ్మూ కశ్మీర్ వేర్పాటువాది నాయకుడు యాసిన్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని యాసిన్ మాలిక్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

New Update
_Yasin Malik

జమ్మూ కశ్మీర్ వేర్పాటువాది నాయకుడు యాసిన్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని యాసిన్ మాలిక్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

2006లో తాను పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ప్రత్యేక డైరెక్టర్ వి.కె.జోషి సూచన మేరకు హఫీజ్ సయీద్‌ను కలిసినట్లు మాలిక్ తెలిపారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతి ప్రయత్నాలకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. తాను పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్, అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్‌లను కలిశానని, తన సమావేశాల వివరాలను వారికి వివరించానని మాలిక్ చెప్పారు. ఈ సందర్భంగా తన ప్రయత్నాలకు మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారని మాలిక్ పేర్కొన్నారు.

అయితే, ఇప్పుడు అదే సమావేశాన్ని తనకు వ్యతిరేకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి చూపించారని మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా తనపై చేయబడిన "మోసం" అని ఆయన ఆరోపించారు. మన్మోహన్ సింగ్‌ హఫీజ్ సయీద్‌తో తన భేటీని సమర్థించినట్లు యాసిన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. మాలిక్ తన అఫిడవిట్‌లో ఈ విషయాలను వెల్లడించడంతో, దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఉగ్రవాద నిధుల కేసులో తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. 1990లో భారత వైమానిక దళానికి చెందిన నలుగురు సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయ్యా సయీద్ కిడ్నాప్ కేసులలో కూడా మాలిక్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కొత్త ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు