/rtv/media/media_files/2025/11/04/tejashwi-yadav-2025-11-04-15-34-12.jpg)
Tejashwi Yadav
బీహార్‌లో గురువారం మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారంతో ఈ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. మహాగఠ్‌బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 'మైబహిన్ మాన్ యోజన' పథకాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ రూ.30 వేలు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల నితీశ్ కుమార్ సర్కార్ నవరాత్రి కానుకగా అక్కడి మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తేజస్వీ యాదవ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: సీరియల్ నటికి వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
గతవారమే విఫక్ష కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని.. రాబోయే ఐదేళ్లు ఒక్కో సంవత్సరానికి రూ.30 వేలు ఇస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదికి గాను మహిళలకు ఒకేసారి రూ.30 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 14న ఈ డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే కనీస మద్దతు ధరతో పాటు రైతులకు బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.300, గోధుమలకు రూ.400 చెల్లిస్తామని తెలిపారు.
అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకం (OPS)ను కూడా పునరుద్ధరిస్తామన్నారు. అలాగే పోలీసు, ఆరోగ్య, పాఠశాల లాంటి అన్నిరకాల ప్రభుత్వ సిబ్బందికి వాళ్ల సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే నియామకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సంచలన హామీ ఇచ్చారు. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 14 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Also Read: నిత్యం నరకం అనుభవిస్తున్నా... ఎయిర్ ఇండియా ప్రయాదంలో బతికిన వ్యక్తి ఆవేదన
Follow Us