/rtv/media/media_files/2025/04/10/D90faqldTgwQevVhZiMz.jpg)
26/11 plotter Tahawwur Rana lands in Delhi
డాక్టర్ టెర్రరిస్ట్‌గా మారాడు. అంతేకాదు ఆయన ఆర్మీలో కూడా పనిచేశాడు. అతని తండ్రి స్కూల్ ప్రిన్సిపల్. అలాంటి వ్యక్తిపై అమెరికా, భారత్‌లో క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. అతనే తహవ్యూర్ హుస్సేన్ రాణా. ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి అయిన తహవ్యూర్ హుస్సేన్ రాణాని పట్టుబట్టి భారత్‌కు పట్టుకొచ్చారు. అది 2008 నవంబర్ 26. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 9 మంది టెర్రరిస్టులతోపాటు 175 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
2011లో మోదీ చెప్పాడు.. 2025 నిజం చేశాడు
2011లో ముంబై అటాక్ లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ ఘటనకు కారణమైన ఉగ్ర సంస్థకు అండగా నిలిచాడన్న అభియోగాలపై అతడిని దోషిగా తేల్చింది. దీనిపై మోదీ ట్విట్టర్ లో స్పందించారు. తహవూర్ రాణాను నిందితుడు కాదని అనడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే అంటూ అందులో రాశారు. ఇది మన దేశ విదేశాంగ విధానానికి భారీ ఎదురు దెబ్బ అన్నారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించడంతో... ఆ పాత పోస్ట్ ను నెటిజన్లు మళ్ళీ షేర్ చేస్తున్నారు. ప్రధాని మోదీ దౌత్య విధానాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. రాణాను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద విజయాన్నే సొంతం చేసుకుందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం రాణాను భారత్‌కు తీసుకొచ్చిన వేళ ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. అసలు తహవ్యూర్ హుస్సేన్ రాణా ఎవరు..? ముంబై ఉగ్రదాడుల్లో ఆయన పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మీలో డాక్టర్ నుంచి లష్కరే తీవ్రవాదిగా
వృత్తిరీత్యా వైద్యుడు అయిన రాణా ఉగ్రవాదిగా మారాడు. తహవ్వూర్ హుస్సేన్ రాణా జనవరి 12, 1961న పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చిచావత్నిలో జన్మించారు. పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్ జనరల్ డ్యూటీ ప్రాక్టీషనర్‌గా పనిచేశారు.అతని భార్య కూడా డాక్టరే. వారు 1997లో కెనడాకు వలస వచ్చి జూన్ 2001లో ఆ దేశ పౌరసత్వం పొందారు. చికాగో, న్యూయార్క్ ప్రాంతాల్లో ఉంటూ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఏజెన్సీ నడిపించేవాడు.- రాణా పాకిస్థాన్‌లో చదువుకునేటప్పుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. పాకిస్తాన్‌పై వీరికున్న ప్రేమ ఉగ్రవాదం వైపు నడిపించింది. లష్కరే నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలకు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్యూర్ హుస్సేన్ రాణా హాజరయ్యారు.
జర్నలిస్టుల తలలు నరికేద్దామని ఫెయిల్
పాకిస్థాన్‌లో ఆర్మీ విడిచి పెట్టి కెనడా వెళ్లాక అతను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ వేసేది. అమెరికాలో మేక, గొర్రె, ఆవుల మాంసం హలాల్ కబేళా బిజినెస్ ఉంది. దీంతోపాటు చికాగోలో అనేక వ్యాపారాలను ప్రారంభించాడు. రాణాకు కెనడాలోని ఒట్టావాలో ఒక ఇల్లు ఉంది. అతని తండ్రి లాహోర్ సమీపంలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్. రాణాకు ఇద్దరు సోదరులు. అందులో ఒకరు పాకిస్తాన్ సైన్యంలో మానసిక వైద్యుడు, మరొకరు కెనడియన్ రాజకీయ పత్రికకు జర్నలిస్ట్.
డానిష్ వార్తాపత్రిక జైలాండ్స్-పోస్టెన్ 2005లో ప్రవక్త ముహమ్మద్ కార్టూన్లను ప్రచురించింది. అందుకు ప్రతీకారంగా మిక్కీ మౌస్ ప్రాజెక్ట్ సీక్రెట్ ఆపరేషన్‌లో రాణా, డేవిడ్ హెడ్లీతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం కోపెన్‌హాగన్‌లో వార్తాపత్రిక సిబ్బంది తలలు నరికేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్లాన్ అమలు చేసే ముందు అది బయటపడి వారిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికా జైల్లో ఎందుకున్నాడంటే..?
26/11 దాడులను ప్లాన్ చేయడానికి ముంబైలో హెడ్లీ ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటుకు రానా సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి . NIA ఛార్జిషీట్ ప్రకారం, 166 మంది మృతి చెందిన 2008 ముంబై ఉగ్రవాద దాడులకు రాణా లాజిస్టికల్ మరియు ఆర్థిక సహాయం అందించాడు. 2009లో అతన్ని అమెరికాలో అరెస్టు చేశారు మరియు అప్పగించడానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని చట్టపరమైన ఎంపికలు అయిపోయిన తర్వాత, అతన్ని ఇప్పుడు భారతదేశానికి తీసుకువస్తున్నారు. ఇండియాకు అప్పగించకు ముందు రాణా లాస్ ఏంజిల్స్ జైలులో ఉన్నాడు. ఫెయిల్ అయిన కోపెన్‌హాగన్ ప్లాన్‌లో రాణా మద్దతు ఇచ్చినందుకు, ఎల్‌ఇటితో సంబంధాల ఉన్నాయని ఎఫ్‌బిఐ 2009లో రాణాను అరెస్టు చేసింది.
ముంబై ఉగ్రదాడుల్లో మాస్టర్ మైండ్..!
ముంబై దాడుల్లో ప్రత్యక్ష ప్రమేయం లేకుండా అమెరికా కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఇతర ఆరోపణలపై అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే రాణా 2008 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రదారి అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతుంది. విచారణ కోసం రాణాను భారత్‌కు అప్పగించాలని ఏళ్ల తరబడి భారత్ అమెరికాను కోరుతోంది. ఆక్రమంలో న్యాయ చిక్కులు అన్నీ వీడి ఏప్రిల్ 10న అమెరికా రాణాను ఇండియాకు అప్పగించింది. అతనికి తీహార్ జైలులో 18 రోజులు కస్టడీ విధించారు. 2008 దాడులకు ముందు రాణా ముంబై, ఢిల్లీ, ఆగ్రా, కొచ్చితో సహా అనేక భారతీయ నగరాలకు వెళ్లాడని NIA అధికారులు చెబుతున్నారు. ప్లాన్ చేసేటప్పుడు అతను హెడ్లీతో డైలీ మాట్లాడినట్లు ఫోన్ రికార్డులు ఉన్నాయి. రాణా ఈ దాడికి పేలుడు పదార్ధాలు మరియు ఆర్థిక సాయం అందించాడని NIA ఆరోపిస్తోంది.