/rtv/media/media_files/2025/12/16/priyanka-gandhi-challenges-bjp-to-contest-fair-election-on-ballot-paper-2025-12-16-16-43-40.jpg)
Priyanka gandhi challenges BJP to contest fair election on ballot paper
దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఓడిపోయిన పార్టీలు EVM ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తుంటాయి. గెలిచిన పార్టీలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తాయి. ఎన్నోఏళ్లుగా ఈ తంతంగం ఇలాగే కొనసాగుతోంది. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా ఓటర్లలో కూడా చాలామంది EVMలతో నిర్వహించే ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఈవీఎంలను నిషేధించి బ్యాలేట్ విధానంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు కూడా చాలాసార్లు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్ చోరీకి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ, గద్దీ ఛోడ్ ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని.. భారతీయులు దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. దేశంలో ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడం లేదని ఆరోపించారు. ఓటు చోరీ జరుగుతున్నా, ఎన్నికల్లో బహిరంగంగా డబ్బులు పంచుతున్నా ఎన్నికల సంఘం మాత్రం కళ్లు మూసుకుంటోందని వ్యాఖ్యానించారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. ఇలా జరిగితే ఆ పార్టీ ఎప్పటికీ ఎన్నికల్లో గెలవదని అందరికీ తెలుసన్నారు. అంతేకాదు బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు చోరీ ద్వారానే గెలిచిందని దేశమంతటా తెలుసని విమర్శించారు. ప్రియంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరోసారి EVM, బ్యాలెట్ పేపర్ల ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.
Also Read: డ్రైవింగ్ చేస్తుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే డేంజర్
EVM ఓటింగ్ ఎప్పుడు మొదలైంది ?
భారత్‌లో ఈవీఎంలను మొదటిసారిగా 1982లో కేరళలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఉత్తర పరవూర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికకు దాదాపు 50 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను వినియోగించి ఎన్నికలు చేపట్టారు. కానీ ఆ సమయానికి ఈవీఎంల వినియోగాన్ని నిర్దేశించే చట్టం లేదు. దీనిపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ వేయగా ఆ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ తర్వాత 1988లో ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951కి సవరణలు చేసి కొత్తగా సెక్షన్ 61Aని చేర్చారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి EVMలను వినియోగించే అధికారం లభించింది.
1998 నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో అయిదు, రాజస్థాన్‌లో అయిదు, ఢిల్లీలో ఆరు స్థానాల్లో కలిపి మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలతో ప్రయోగాత్మకంగా ఎన్నికలు నిర్వహించారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో EVMలను వినియోగించారు. 543 పార్లమెంటు స్థానాలకు విజయవంతంగా ఈ ఎన్నికలు నిర్వహించారు.
VVPAT ప్రవేశం
ఓటర్లకు మరింత పారదర్శకతను, విశ్వాసాన్ని పెంచడం కోసం ఈవీఎంలలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (VVPAT) విధానాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం 2013 నుంచి దీన్ని దశలవారీగా తీసుకొచ్చింది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అన్ని నియోజకవర్గాల్లో VVPATలతో కూడిన ఈవీఎంలను వినియోగించారు. ఈవీఎంలు రావడంతో బ్యాలెట్ పేపర్ల వినియోగం తగ్గడంతో పాటు ఓటింగ్ సమయం కూడా తగ్గింది. ఓట్ల లెక్కింపు వేగంగా జరుగుతోంది. చెల్లనిఓట్ల సంఖ్య కూడా చాలావరకు తగ్గిపోయింది. మన ఓటు వేసిన అభ్యర్థికే ఆ ఓటు పడిందో లేదో అనేది VVPAT ద్వారా చూడొచ్చు. ఓటర్లకు తమ ఓటుపై నమ్మకం కలిగించేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ ఎప్పుడు వచ్చింది ?
భారత్‌లో బ్యాలెట్ ఓటింగ్ విధానం మొదటి సార్వత్రిక ఎన్నికలప్పుడే ప్రారంభించారు. 1951 నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగిన మొదటి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఈ పద్ధతిని వినియోగించారు. పోలింగ్ బూత్‌లో ప్రతీ అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల చిహ్నంతో బ్యాలెట్ పెట్టె ఉండేది. ఓటరు తమకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన పెట్టెలోకి వెళ్లి ఎన్నికల అధికారి ఇచ్చిన సాధారణ బ్యాలెట్ పేపర్‌ను ఆ పెట్టెలో వేసేవారు. నిరక్షరాస్యులకు సులభంగా అర్థమయ్యేలా, అభ్యర్థులను గుర్తించేందుకు ఈ విధానాన్ని పాటించారు.
Also Read: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు
1962 నుంచి లోక్‌సభ ఎన్నికలను మరింత సులభతరం చేసేందుకు బ్యాలెట్ పేపర్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ పద్ధతిలో ఒకే బ్యాలెట్ పేపర్‌పై పోటీ చేసిన అభ్యర్థులు, వాళ్ల పేర్లు, గుర్తులు ముద్రించారు. ఓటరు తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ముద్ర వేసి, ఆ బ్యాలెట్ పేపర్ను సాధారణ బ్యాలెట్ పెట్టెలో వేసేవారు. 2001 వరకు ఇదే విధానం కొనసాగింది. అయితే కోట్లాది బ్యాలెట్ పేపర్లను లెక్కించేందుకు ఎన్నికల అధికారులకు కొన్నివారాలు పట్టేది. అంతేకాదు ఓటర్ల తప్పిదం వల్ల పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు పడేవి. అలాగే బ్యాలెట్ పేపర్లను తారుమారు చేయడం, దొంగిలించడం లాంటి ఘటనలకు అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే ఎన్నికలను మరింత వేగంగా, సులభతరంగా చేసేందుకు ఈవీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ దేశంలో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు మాత్రం పాత పద్ధతి ప్రకారం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగుతున్నాయి.
Follow Us