/rtv/media/media_files/2025/10/16/140-more-to-surrender-tomorrow-2025-10-16-21-56-57.jpg)
140 more Maoists surrender tomorrow
Maoists : మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు 60 మంది లొంగిపోయారు. ఆయన బాటలోనే మరో అగ్రనాయకుడు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఈరోజు లొంగిపోయారు. ఆయనతోనూ 170 మంది లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక నేతలు రూపేష్, రనిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు(శుక్రవారం, అక్టోబర్ 17న జగదల్‌పూర్‌లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి అడవిని వీడి భైరామ్‌గఢ్ వైపు వెళుతున్నారు. అక్కడి నుంచి వారు ఇంద్రావతి నది అవతలి వైపుకు చేరుకుంటారు. నక్సలైట్లందరూ లొంగిపోతున్న సందర్భంగా 70కి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. లొంగుబాటు సందర్భంగా భైరామ్‌గఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు వారికోసం గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఈ నదిని దాటి జగదల్‌పూర్‌కు చేరుకుంటున్నారు. ఉస్పారి ఘాట్ మార్గంలో బయటి వ్యక్తులెవరినీ ప్రయాణించడానికి అనుమతించడం లేదు.
రూపేష్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ మావోయిస్టు నేతగా తెలుస్తోంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) లోని మాడ్ డివిజన్‌లో లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, శిక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీ, స్థానిక జోనల్ నిర్మాణం మధ్య సంబంధాల వారధిగా పనిచేసినట్లు తెలుస్తోంది. అలాగే రనిత.. DKZC మాడ్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సీనియర్ మహిళా కమాండర్. బస్తర్ జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్‌లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.దీంతో లొంగుపోక తప్పడం లేదు. మావోయిస్టులు కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న మావోయిస్టులు వందల సంఖ్యలో జన జీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. గత రెండు రోజులుగా అగ్రనేతలతో సహా 283 మంది మావోయిస్టులు తాము చేతపట్టిన తుపాకులను, నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమయ్యారు.