Maoist: హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన తరువాత దండకారణ్యంలో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి మరి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా 2 వేల మంది భద్రతాబలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది. వేలసంఖ్యలో కేంద్ర జవాన్లు తెలంగాణ అడవులను జల్లెడ పడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణనే సేఫ్ జోన్.. తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని సైనిక శిబిరాలపై మావోయిస్టులు ఆకస్మిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. మావోయిస్టులు తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించి సేఫ్ జొన్లను రెక్కీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 'ఆపరేషన్ కగార్' తారాస్థాయికి చేరుతుండటంతో తెలంగాణను సేఫ్ జోన్ గా మార్చుకునేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నారనే సమాచారంతో కేంద్ర హోంశాఖ క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ చేపడుతోంది. క్రాస్ బార్డర్ ఆపరేషన్లకు సిద్ధం.. ఇక ఇటీవల మావోయిస్టుల అడ్డాలో పర్యటించిన అమిత్ షా.. దండకారణ్యంవ్యాప్తంగా కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. అవసరమైతే క్రాస్ బార్డర్ ఆపరేషన్లకు సైతం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో మావోయిస్టుల కార్యాకలాపాలపై నిగూఢ సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ఇంటలిజెన్స్, ఎస్ఐబీకి సూచనలు ఇచ్చారు. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు విధ్వంసకరమైన ఘటనలకు పాల్పడుతారనే సమాచారం ఉందన్న పోలీసు అధికారులు.. తెలంగాణ గ్రేహౌండ్స్ లో ఏఎస్పి క్యాడర్‌లో పనిచేస్తున్న పదిమంది యువ ఐపీఎస్‌లను దండకారణ్యం జోన్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: CP: వాళ్లు నన్ను ట్రోల్ చేస్తారు.. భారత టీమ్‌పై సీవీ ఆనంద్ సెటైర్లు! సమాచారం లేదంటున్న తెలంగాణ పోలీసులు.. నిజానికి ఒక రాష్ట్ర పోలీసులు బార్డర్ దాటి వెళ్లాలంటే పర్మిషన్ తప్పనిసరి. ప్రత్యేక ఆపరేషన్స్ సమయంలో మాత్రమే క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ చేపడుతుంటారు. గతంలో తెలంగాణ పోలీసులు ఛత్తీ్‌సగఢ్‌లో ఆపరేషన్లు నిర్వహించగా.. సోమవారం కేంద్ర బలగాలతో కలిసి ఛత్తీ్‌సగఢ్ బస్తర్ ఫైటర్స్, డీఆర్జఈ, ఎస్‌టీఎఫ్, మహిళా కమాండోలు దాదాపు 2 వేల మంది తెలంగాణ అడవుల్లోకి వచ్చారు. అయితే దీనిపై స్పందించిన ఛత్తీ్‌స్ గఢ్ పోలీసులు..స్పెషల్ ఆపరేషన్ కోసమే సరిహద్దులను దాటి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర బలగాల రాకపై తనకు ఎలాంటి సమాచారం లేదని చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజువర్మ చెబుతున్నారు.