Wall collapses: వర్షానికి కుప్పకూలిన 200 అడుగుల కోట గోడ (VIDEO)

రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

New Update
wall collapses at Amer Fort

wall collapses at Amer Fort

రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షపు నీరు గోడపై భారీగా ప్రవహించి, దీంతో పురాతన గోడ బలహీన పడి ఒక్కసారిగా కూలిపోయింది. పెద్ద మొత్తంలో శిథిలాలు కిందపడ్డాయి. ఈ సంఘటన స్థానికులను, పర్యాటకులను ఆందోళనకు గురిచేసింది.

రాజస్థాన్‌లో భారీ వరద

జైపూర్‌తో పాటు, రాజస్థాన్‌లోని ఇతర ప్రాంతాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్ వంటి జిల్లాల్లో వరదలు పోటెత్తడంతో ప్రజల జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం తెగిపోయింది. దీంతో పలు గ్రామాలు పూర్తిగా ఒంటరిగా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వాతావరణ హెచ్చరికలు:

రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, విపత్తు సహాయక శాఖ మంత్రి కిరోడి మీనా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లతో కలిసి కోట డివిజన్‌లో వైమానిక సర్వే నిర్వహించనున్నారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, గత 24 గంటల్లో బుండిలోని నైన్వాలో రికార్డు స్థాయిలో 502 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. భిల్వారా, చిత్తోర్‌గఢ్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, బుండి, కోట, పాలి, రాజసమంద్, ఉదయ్‌పూర్, డంగార్‌పూర్, బన్స్‌వారా, జలోర్, సిరోహి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ భారీ వర్షాలు చారిత్రక కట్టడాల పరిరక్షణపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన అమెర్ ఫోర్ట్‌కు జరిగిన ఈ నష్టం పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

Advertisment
తాజా కథనాలు