/rtv/media/media_files/2025/10/18/rss-2025-10-18-15-37-54.jpg)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కర్ణాటక ప్రభుత్వం(karnataka government) ఒక పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)పై సస్పెన్షన్ వేటు వేసింది. సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు గాను ఈ అధికారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సస్పెండైన అధికారి రాయచూరు జిల్లాలోని సిర్వార్ తాలూకాకు చెందిన ప్రవీణ్ కుమార్ కేపీగా గుర్తించారు. ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12న లింగసూగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రూట్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ మార్చ్‌లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాం ధరించి, చేతిలో కర్ర పట్టుకుని కవాతు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : ఇది ట్రైలరే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ఈ ఫోటోల ఆధారంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (RDPR) శాఖ కమిషనర్ అరుణ్ధతి చంద్రశేఖర్ శుక్రవారం ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ తటస్థతను పాటించాలని, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను కలిగి ఉండాలని సూచించే కర్ణాటక సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 2021లోని నిబంధన 3ని అధికారి ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్‌లోనే ఉంటారని, జీవనాధార భత్యం చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా రాజకీయ సంబంధాలున్న సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే నిబంధనలను కఠినంగా అమలు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ సస్పెన్షన్ జరిగింది. ఈ చర్యపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర స్పందిస్తూ, ఇది 'దేశభక్తి భావాలపై దాడి' అని, కాంగ్రెస్ దురుద్దేశంతో కూడిన 'హిందూ వ్యతిరేక మనస్తత్వానికి' నిదర్శనమని విమర్శించారు. సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ...మిగిలింది 500 మందే (నా)?