Karnataka: డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య విభేదాలకు కారణం అదేనా ?

కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.

New Update
CM siddramaiah and dk shiva kumar

CM siddramaiah and dk shiva kumar

కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. తామందరం కూడా ఆయనకు సహకరిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో పోస్టు చేశారు. '' 140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే. పార్టీలో గ్రూప్‌లో పెట్టడం అనేది నా బ్లడ్‌లో లేదు. కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరణ చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రి కావాలని అందరూ అనుకుంటారు.   

ఢిల్లీలో వాళ్లు పార్టీ హైకమాండ్‌తో భేటీ అవ్వడం సాధారణమే. ఇది వాళ్ల హక్కు. అధిష్ఠానానికి చెప్పొద్దని వాళ్లని మేము ఆపలేం. ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య అన్నారు. మేము ఆయనతో కలిసే పనిచేస్తాం. హైకమాండ్ ఆదేశాలకు మేము కట్టుబడి ఉంటామని'' డీకే శివకుమార్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సీఎం కూర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ నెలకొంది. చివరికి సీనియార్టీని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. 

Also read: సిరియన్ హ్యాండ్లర్, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ ట్యూటోరియల్స్..ఢిల్లీ బాంబు బ్లాస్ట్ పక్కా స్కెచ్

రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందని అప్పట్లోనే ప్రచారం నడిచింది. తాజాగా సిద్ధరామయ్య సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచాయి. ఈ క్రమంలోనే సీఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయనకే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.  కానీ సిద్ధరామయ్య మాత్రం సీఎం మార్పు అంశాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కొన్నిరోజల క్రితం కూడా ఆయన ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి హైకమాండ్‌ కూడా పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 

డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు విభేదం ఏంటి ? 

సిద్ధరామయ్య రాజకీయ జీవితం 1980లో జనతా దళ్‌ (సెక్యులర్) పార్టీతో ప్రారంభమయ్యింది. కొంతకాలానికి ఆయన ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత దేవెగౌడ, కుమారస్వామిలతో సిద్ధరామయ్యకు విభేదాలు రావడంతో 2005లో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో సిద్ధరామయ్య 2006లో కాంగ్రెస్‌లో చేరారు. 2013లో కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మొదటిసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హైకమాండ్ సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని, అలాగే సిద్ధరామయ్యకు ప్రజల్లో ఉన్న గుర్తింపు ఆధారంగా రెండోసారి ఆయనకు సీఎం పదవి అప్పగించారు. 

ఇక డీకే శివకుమార్ 1980ల్లోనే విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో చురుకుగా ఉన్నారు. 1989లో తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సాతనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1990లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను డీకే శివకుమారే గెలిపించారనే ప్రచారం కూడా నడిచింది. అయితే కాంగ్రెస్ గెలిచిన అనంతరం సీఎం ఎవరు అనేదానిపైనే తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. చాలామంది పార్టీ కార్యకర్తలు డీకే శివకుమార్‌కు సీఎం పదవి వస్తుందని ఆశించారు. కానీ హైకమాండ్‌ సిద్ధరామయ్యకు అప్పగించింది. దీంతో డీకే శివకుమార్‌ మద్దతుదారుల్లో అసంతృప్తి నెలకొంది. రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందని ఆ సమయంలో ప్రచారం కూడా నడిచింది.

Also read: అప్పట్లో భుట్టో.. ఇప్పుడు షేక్ హసీనా.. ఇద్దరు ప్రధానులకు ఉరిశిక్ష, ఒకే పరిస్థితి

 ఇటీవల డీకే శివకుమార్‌ మద్దతుదారులు పలు కార్యక్రమాల్లో బహిరంగంగా డీకే శివకుమార్‌ సీఎం అవుతారని ప్రకటించారు. దీంతో సీఎం మార్పు అంశం కీలకంగా మారింది. డీకే శివకుమార్‌ కూడా తన మద్దతుదారులు నేను సీఎం అవ్వాలని కోరడంతో తప్పేముంది అని కూడా ఓసారి అన్నారు. ఈ విషయంలోనే డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం నడిచింది. చివరికి హైకమాండ్‌ పార్టీలో ఎలాంటి విభేదాలు జరగకుండా చాకచక్యంగా వ్యహరించింది. సీఎం మార్పుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి సిద్ధరామయ్యకే ఐదేళ్ల పాటు సీఎం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఒకవేళ సీఎం మార్పు ఉంటే పార్టీకే నష్టమని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎంగా ఐదేళ్లపాటు సిద్ధరామయ్యే అని క్లారిటీ వచ్చేసింది. అయితే కేబినెట్ విస్తరణకు మాత్రం హైకమాండ్ అంగీకరించింది.   

Advertisment
తాజా కథనాలు