DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లనివ్వరు: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంతకారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరు అంటూ  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదించిన టన్నెల్‌ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

New Update
DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar : సొంతకారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరు అంటూ  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేయడం గమనార్హం. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదించిన టన్నెల్‌ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

టన్నెల్‌ రోడ్‌ ప్రాజెక్టును రద్దు చేయాలని, మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ను విస్తరించాలని కోరుతూ బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలు కార్లు కొనడం వెనక ఉన్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా..? ప్రజలు వారి కుటుంబాలతో కలిసి సొంతవాహనాల్లో వెళ్లడానికే ఎక్కువగా మొగ్గుచూపుతారు. వారిని కార్లు వాడొద్దని మనం చెప్పగలమా..? అంతగా అవసరం అనుకుంటే కార్లు వాడొద్దు. ప్రజా రవాణాను వాడుకోమని తమ నియోజకవర్గ ప్రజలకు ఎంపీలు చూసించుకోవచ్చు. అయితే దాన్ని ఎంతమంది వింటారో చూడాలి. కారులేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ఈరోజుల్లో ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది’’ అని శివకుమార్ మీడియాతో అనడం ఆసక్తికరంగా మారింది.

 అయితే ఆయన వ్యాఖ్యలపై ఎంపీ తేజస్వి సూర్య వెటకారంగా స్పందించారు. ‘‘బెంగళూరు ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం టన్నెల్ రోడ్ ప్రాజెక్టును తీసుకువచ్చిందని ఇంతకాలం నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇది ఒక సామాజిక సమస్యను తీర్చడానికి ఉద్దేశించిందని డిప్యూటీ సీఎం స్పష్టత ఇచ్చారు. నేను ఎంత తెలివితక్కువగా ఆలోచించాను’’ అని డీకే వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా టన్నెల్‌ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాన్ని, ప్రజారవాణాకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు చేశానని వెల్లడించారు. అయితే వాటన్నింటిని శివకుమార్‌ తిరస్కరించారని చెప్పారు.

కాగా ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కష్టాలకు టన్నెల్ ప్రాజెక్ట్ ఒక మంచి పరిష్కారం అని డీకే చాలాకాలంగా చెప్తున్నారు. కానీ, దానివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజా రవాణా విషయంలో ఇది సరైన పరిష్కారం కాదని సూర్య వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా శివకుమార్‌ స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Melisa Hurricane: మెలిసా హరికేన్ తాండవం..30 మంది మృతి

Advertisment
తాజా కథనాలు