/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t074345-2026-01-12-07-44-06.jpg)
Swami Vivekananda Jayanti 2026-National Youth Day
జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనుల దినోత్సవం(national-youth-day) అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో కేవలం కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ఫోటోలకు పరిమితమవు తున్నామా? లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని బలంగా వ్యక్తపరిచిన ఆలోచనావేత్త స్వామి వివేకానంద. ఆయన యువతను కేవలం ఉద్యోగ సాధన యంత్రాలుగా చూడలేదు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, కార్యదక్షత కలిగిన పౌరులుగా తయారుచేయాలనుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన అప్పుడే గుర్తించారు.
వివేకానంద(swami-vivekananda) బోధనల్లో సేవకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. పేదరికం, అజ్ఞానం, అసమానతలే భారతదేశానికి అసలైన శత్రువులని ఆయన భావించారు. దరిద్రనారాయణ సేవే నిజమైన దైవసేవ అన్న భావనతో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలని కోరుకున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు యువతలో సేవాభావం పెరిగినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నది ఆయన సందేశం. సమసమాజ నిర్మాణం వివేకానంద కల. కుల, మత, వర్గ భేదాలు దేశాన్ని బలహీనపరుస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రతి మనిషిలో దైవత్వం ఉందన్న వేదాంత సత్యం ఆధారంగా సమానత్వ భావనను ప్రచారం చేశారు. నేటి సమాజంలో ఇంకా కొనసాగుతున్న వివక్షలు, అసమానతలు చూస్తే వివేకానంద ఆలోచనలు ఎంత అవసరమో అర్థమవుతుంది.
Also Read : భారత్ నన్ను చూసి భయపడుతోంది...ఓ పాక్ ఉగ్రవాది మదం మాటలు
Swami Vivekananda Jayanthi
మత సామరస్యం విషయంలో స్వామి వివేకానంద ప్రపంచానికి మార్గదర్శకుడు. 1893లో చికాగో ప్రపంచ మత సభలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రాసంగికమే. అన్ని మతాల మూల లక్ష్యం మానవత్వమే అన్న ఆయన మాటలు మత ఘర్షణలు పెరుగుతున్న ఈ కాలంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మతం మనిషిని విడగొట్టడానికి కాదు, కలిపేందుకు అన్న భావనను యువత గ్రహించాల్సిన అవసరం ఉంది. మహిళ ప్రగతిపై వివేకానంద అభిప్రాయాలు నేటి కాలానికి కూడా దిశానిర్దేశం చేస్తాయి. మహిళలను గౌరవించని సమాజం ఎదగదని ఆయన స్పష్టంగా చెప్పారు. మహిళ విద్య, స్వావలంబన, స్వేచ్ఛ లేకుండా దేశాభివృద్ధి అసాధ్యమని ఆయన విశ్వాసం. మహిళలను వెనుకకు నెట్టే ఆలోచనలపై ఆయన బోధనలు ప్రశ్నలు వేస్తున్నాయి.
వివేకానంద ఆలోచనలకు మూలం వేదాంత దర్శనం. అద్వైత వేదాంతం ఆధారంగా ఆత్మ ఒకటే అన్న సత్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రతి వ్యక్తిలో అపార శక్తి దాగి ఉందని, దాన్ని గుర్తించి వెలికి తీయడమే నిజమైన ఆధ్యాత్మికత అని ఆయన బోధించారు. ఆత్మవిశ్వాసం లేకుండా వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నేటి యువత నిరుద్యోగం, పోటీ, మానసిక ఒత్తిళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వివేకానంద ఆలోచనలు ఒక మార్గదర్శక దీపంలా నిలుస్తాయి. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు సాగితే విజయం సాధ్యమన్న ఆయన సందేశం యువతకు దిశ చూపుతుంది. నేటి యువత పరిస్థితిని పరిశీలిస్తే, చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అన్న భావన పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం లేకుండా చదవడం, జీవిత విలువలను పక్కన పెట్టడం, సమాజం పట్ల బాధ్యతను మరచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా కొంతమంది యువకులు చెడు అలవాట్లకు బానిసలవుతూ, సమయాన్ని వృథా చేస్తూ, ఆత్మహత్య చేసుకుంటూ, తమ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెట్టుతున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువత యొక్క అభిరుచులు తెలుసుకొని వారిని ప్రోత్సహించి, సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది.
వివేకానందుని బోధనలను స్ఫూర్తిగా తీసుకుని యువత ఇలా ముందుకు సాగాలి. "నీలో దైవం ఉంది" అనే మాటలతో స్కిల్స్ నేర్చుకొని స్టార్టప్‌లు ప్రారంభించాలి. ఉదాహరణకు, AI, రెన్యూవబుల్ ఎనర్జీల్లో ఆవిష్కరణలు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ లిటరసీ, ఆరోగ్య సేవలు అందించే స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొనాలి. రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు ఇప్పటికే యువతకు మార్గదర్శకులు. దాన్యం, క్రమశిక్షణ: డిజిటల్ డిటాక్స్‌తో మెడిటేషన్ పద్ధతులు అమలు చేసి మానసిక బలాన్ని పెంచుకోవాలి. ఇటీవలి సర్వేల ప్రకారం, భారతదేశంలోని 18-25 సంవత్సరాల యువతలో 65% మంది వివేకానందుని "ధైర్యం, ఆత్మవిశ్వాసం, సేవా మనస్సు" బోధనలను తమ జీవితంలో అమలు చేస్తున్నారని తెలిపారు. స్టార్టప్ సంస్కృతిలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల్లో పనిచేసే యువకులు "భయం లేకుండా ముందుకు సాగండి" అనే అతని సందేశాన్ని ప్రతిపాదిస్తున్నారు. అయితే, ఉద్యోగాల కొరత, మానసిక ఒత్తిడి లాంటి సవాళ్ల మధ్య కొందరు ఈ బోధనలను మర్చిపోతున్నారు. ఫలితంగా, స్వయం ఉపార్జనకు బదులు 'ఎదురుచూపు మనస్తత్వం' పెరుగుతోంది.
Also Read : ISROకు రేపు కీలకం.. 2026లో తొలి ప్రయోగం PSLV-C62
ఈ మార్గంలో యువత సాగితే, భారతదేశం 'వికసిత దేశం' లక్ష్యాన్ని సులభంగా సాధించగలదు. 2047 నాటికి GDPలో యువత సహకారంతో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. స్వచ్ఛ శక్తి, స్పేస్ టెక్నాలజీల్లో ఆవిష్కరణలు, సామాజిక న్యాయం– ఇవన్నీ వివేకానంద స్ఫూర్తితో సాధ్యమే. ప్రభుత్వం 'వికసిత యువ భారత్' కార్యక్రమాలతో ఈ దిశగా పనిచేస్తోంది.స్వామి వివేకానంద జయంతిని ఒక ఆచారంగా కాకుండా, ఆలోచనగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాటలను పోస్టర్లకు పరిమితం చేయకుండా, జీవితంలో ఆచరించినప్పుడే జాతీయ యువజనుల దినోత్సవానికి నిజమైన అర్థం చేకూరుతుంది. సేవాభావం, సమానత్వం, మత సామరస్యం, మహిళ గౌరవం, వ్యక్తిత్వ వికాసం—ఇవే వివేకానంద యువతకు ఇచ్చిన నిజమైన పిలుపు. ఆ పిలుపుకు స్పందించినప్పుడే బలమైన, సమర్థవంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. నిరంతర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి పాత్రే కీలకం. స్వామి వివేకానంద మాటల్లో 'ధైర్యంగా ఆలోచించండి… ధైర్యంగా మాట్లాడండి… ధైర్యంగా కార్యాచరణ చేయండి' 'ఒక ఆలోచనను మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి.” “మనిషిలో దాగి ఉన్న సంపూర్ణతను వెలికి తీయడమే నిజమైన విద్య.”జాతీయ యువజన దినోత్సవం ఈ సందేశాన్ని ప్రతి యువకుడిలో చేర్చాలి. మన యువత ఈ బోధనలతో ముందుకు సాగితే, భారతదేశం ప్రపంచ గురువుగా మారుతుంది.
డా. కోమల్ల ఇంద్రసేనారెడ్డి,
లైబ్రేరియన్, కిట్స్, వరంగల్
9849375829
Follow Us