Shubhanshu Shukla: స్వదేశానికి శుభాంశు శుక్లా...ఘన స్వాగతం పలికిన ప్రజలు

యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు.

New Update
Shubhanshu Shukla

 Shubhanshu Shukla

 Shubhanshu Shukla :  యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. ఆయన విమానం ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా  విద్యార్థుల బృందం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.శుభాంశు శుక్లా కు ప్రజలు భారత్ మాతా కీ జై  అంటూ నినాదాలు చేస్తూ, జాతీయ పతాకంతో  ఘన స్వాగతం పలికారు. కాగా ఆయన ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలువనున్నారు. తన స్వస్థలమైన లక్నోను సందర్శిస్తారు. ఆగస్టు 22-23 తేదీలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా జితేంద్ర సింగ్  మాట్లాడుతూ శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకోవడం భారత్​కు ఎంతో గర్వకారణమైన క్షణమని అభివర్ణించారు. " ఇది భారతదేశానికి గర్వకారణమైన క్షణం! ఇస్రోకు కీర్తినిచ్చే క్షణం! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దీనికి దోహదపడిన వ్యవస్థకు కృతజ్ఞత తెలుపుతూ, దేశ అంతరిక్ష వైభవం భారత గడ్డను తాకిందన్నారు. భారతమాత దిగ్గజ పుత్రుడు శుభాంశు శుక్లా ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో అడుగుపెట్టారన్నారు. ఆయనతో పాటు మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు" అని కేంద్ర మంత్రి తెలిపారు.

కాగా, యాక్సియం-4 మిషన్‌ విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు వస్తున్నానంటూ శుక్లా శనివారం పోస్టు ద్వారా తెలిపారు.తను  స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమానంలో కూర్చున్నప్పుడు భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. మిషన్‌ కోసం గతేడాది నుంచి తన స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇది తనను ఎంతో బాధించిందని వాపోయారు. వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 


రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను నిర్వహించిన శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే వ్యోమగాములను క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు ఈ బృందంలో ఉన్నారు. శుభాంశు శుక్లా  అంతరిక్షంలో 60 కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, 20 అవేర్ నెస్ సెషన్లను నిర్వహించారు. ఆక్సియం-4 మిషన్ కోసం, శుభాంశు శుక్లా అమెరికాలో ఒక సంవత్సరం పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. జూన్ 25, 2025న, అతను ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్షానికి బయలుదేరారు. మరుసటి రోజు, జూన్ 26న, అతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నాడు. 

భారతదేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శుభాంశు శుక్లా  అంతరిక్షంలో ఏడు ముఖ్యమైన ప్రయోగాలపై పనిచేశాడు. వీటిలో అంతరిక్షంలో పచ్చి శనగలు, మెంతుల అంకురోత్పత్తి, శరీరంపై స్థలం ప్రభావం అధ్యయనం, కండరాల బలహీనత, మెదడు -కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రయోగాలు భారతదేశ శాస్త్రీయ పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా, భవిష్యత్తులో వ్యవసాయం, మానవ ఆరోగ్యం, అంతరిక్షంలో సాంకేతిక అభివృద్ధిలో గణనీయమైన సహకారాన్ని అందించనున్నాయి.

Also Read : RS Praveen Kumar: కేసీఆర్‌ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన ఆరోపణ

Advertisment
తాజా కథనాలు