/rtv/media/media_files/2025/07/17/pm-kisan-amount-status-check-1-2025-07-17-11-36-10.jpg)
PM Kisan Samman Scheme
PM Kisan Samman Scheme : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రం ఈ మేరకు ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 9.7 కోట్ల మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి ఆగస్టు 2న రూ.2 వేలను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.కాగా 20వ విడతలో రూ.20,500 కోట్లు నిధులు రైతులకు పంపిణీ చేయనున్నారు.
Also Read : పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఫిబ్రవరి 2, 2019లో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. అయితే అన్ని ఒకసారి కాకుండా ఈ నిధులు నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది.
Also Read : తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యంగా కేంద్రం పేర్కొంటున్నది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ పథకం ప్రయోజనం సకాలంలో e-KYC, భూమి రికార్డు ధృవీకరణ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయని లేదా రికార్డులు అసంపూర్ణంగా ఉన్నవారికి ఈసారి కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం వర్తించదని స్పష్టం చేసింది. ఈ విషయంలో అర్హత కలిగిన రైతులు వీలైనంత త్వరగా వారి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తి చేసింది.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!