/rtv/media/media_files/2025/12/29/insv-kaundinya-2025-12-29-15-55-24.jpg)
ఇండియా(india) ప్రాచీన నౌకా నిర్మాణ వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఓ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. భారత నౌకాదళానికి చెందిన INSV కౌండిన్య(INSV Kaundinya) అనే స్పెషల్ షిప్ డిసెంబర్ 29, 2025న గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇంజిన్ లేని ఈ ఓడతో వేల ఏళ్ల నాటి భారత్-అరబ్ వాణిజ్య మార్గాలను పునరుద్ధరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.
Also Read : వెటకారంగా పోస్ట్..తర్వాత సారీ... వీళ్ళ ఆటలింకెన్నాళ్ళు?
INSV కౌండిన్య ప్రత్యేకతలు
INSV కౌండిన్య అనేది ఆధునిక ఇనుప మేకులు లేదా వెల్డింగ్ ఏదీ లేకుండా, కేవలం పురాతన పద్ధతిలో నిర్మించిన 'స్టిచ్డ్ షిప్' (కుట్టిన ఓడ). అజంతా గుహలలోని 5వ శతాబ్దం పెయింటింగ్స్‌లో కనిపించే ఓడల ఆకృతి ఆధారంగా దీనిని రూపొందించారు. కేరళకు చెందిన నిపుణులైన వడ్రంగులు బాబు శంకరన్ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. చెక్కలను ఒకదానికొకటి అతికించడానికి మేకులను వాడకుండా, కొబ్బరి పీచు తాళ్లతో కుట్టారు. నీరు లోపలికి రాకుండా న్యాచురల్ రెసిన్లు, చేప నూనె, చెట్ల జిగురు ఉపయోగించి సీల్ చేశారు. దీనికి ఇంజిన్ ఉండదు. కేవలం గాలి వాటాన్ని బట్టి సాగే తెరచాపల సాయంతో ఇది సముద్రంపై ప్రయాణిస్తుంది.
భారతీయ నావికులు వేల ఏళ్ల క్రితమే రోమ్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు ఇలాంటి ఓడల పైనే ప్రయాణించి వాణిజ్యం సాగించారు. ఈ నౌకకు ప్రాచీన భారతీయ నావికుడు 'కౌండిన్యుడి' పేరు పెట్టారు. ఆయన సముద్రయానం చేసి ఆగ్నేయాసియాలో (నేటి కాంబోడియా) భారతీయ సంస్కృతిని విస్తరించారని చరిత్ర చెబుతోంది. ఈ ఓడ తెరచాపలపై గండభేరుండం, సూర్యుని చిత్రాలు ఉన్నాయి. ఓడ ముందు భాగంలో సింహ యాలి శిల్పం, డెక్ పైన హరప్పా శైలి రాతి లంగరు అమర్చారు.
ఈ యాత్ర ప్రాముఖ్యత
కేంద్ర సాంస్కృతిక శాఖతోపాటు ఇండియన్ నేవీ జాయింట్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది భారతదేశం 'సాఫ్ట్ పవర్'ను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం. ఆధునిక సాంకేతికత లేని కాలంలోనే భారతీయులు సముద్రాలను ఎలా జయించారో ఈ ప్రయోగం నిరూపిస్తుంది. ఒమన్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను ఈ యాత్ర మరింత బలోపేతం చేస్తుంది. 16 మంది ఇండియన్ నేవీ సిబ్బంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు. వీరికి ప్రాచీన నావిక విద్యలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. INSV కౌండిన్య కేవలం ఒక ఓడ కాదు. ఇది సముద్రంపై ప్రయాణించే మన దేశపు సజీవ చరిత్ర. ఈ యాత్ర విజయవంతం కావడం ద్వారా ప్రపంచ నౌకాయాన చరిత్రలో భారతదేశం మరోసారి తనదైన ముద్ర వేయనుంది.
Also Read : ఒక్కటైతున్న పొలిటికల్ ఫ్యామిలీస్.. మహారాష్ట్రలో BJPకి మూడిటన్లే
Follow Us