/rtv/media/media_files/2025/12/29/lalith-modi-2025-12-29-17-45-20.jpg)
బ్యాంకులను ముంచేసి..భారత్ కు నష్టాలను మిగిల్చి పారిపోయారు లలిత్ మోదీ, విజయ్ మాల్యా. ఈ ఇద్దరూ ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నేళ్ళు అవుతున్నా వీరిని తిరిగి భారత్ కు రప్పించలేకపోయారు. దీంతో ఇద్దరికీ బాగా పొగరు పెరిగిపోయింది. ఆ బలుపుతోనే రీసెంట్ గా లలిత్ మోదీ ఒక వీడియో చేశాడు. అందులో మేము పరారీలో ఉన్న అతి పెద్ద పన్ను ఎగవేతదారులం అంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దాంతో లలిత్ మోదీ క్షమాపణలు చెప్పి, వీడియోను డిలీట్ చేశారు. ఎవర్నీ కించపరచడం తమ ఉద్దేశం కాదంటూ సింపుల్ గా సారీ చెప్పాడు. కానీ నెటిజన్లు మాత్రం లలిత్ మోదీపై, అలాగే భారత ప్రభుత్వంపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఇలాంటి వారిని ఉపేక్షిస్తారని..ఇంతలా చెలరేగిపోతున్నా పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. బ్యాంకులను నిండా ముంచేసి పారిపోవడమే కాకుండా.. భారత్‌ను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.
అసలేం జరిగింది?
గతవారం లండన్‌లో విజయ్ మాల్యా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. దీనికి లలిత్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగానే మాల్యాతో కలిసి మోదీ వీడియోను చేసి.. ‘మేము అతిపెద్ద పలాయనవాదులం.... మళ్లీ ఇంటర్నెట్‌ను షేక్ చేయడానికి నేను ఏదైనా చేస్తాను. ఇది మీకోసం... అసూయతో మీ గుండెలు మండిపోనివ్వండి’ అంటూ నోటికొచ్చినట్టు వాగాడు లలిత్ మోదీ. పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేశాడు. మోదీ, మాల్యాలు పక్కపక్కనే నిలబడి‘భారత్‌కు చెందిన మేము ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులం’ అని చెప్పడం స్పష్టంగా అందులో వినిపిస్తోంది. ఇద్దరూ ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళే. ఇద్దరూ భారత్ నుంచి పారిపోయి లండన్ లో దాక్కున్నారు. అక్కడి చట్టాలను అడ్డం పెట్టుకుని శిక్షల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. హాయిగా విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.
లలిత్ మోదీ వీడియోపై విపరీతమైన స్పందనలు వచ్చాయి. అంత ఒళ్ళు బలుపు ఏంటంటూ నెటిజన్లు తిట్టిపోశారు. దీంతో మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో లలిత్ మోదీ క్షమాపణలు చెప్పాడు. నేను ఎవరి మనోభావాలనైనా కించపరిస్తే నన్ను క్షమించండి.. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. ఆ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఉద్దేశపూర్వకంగా నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు.. మరోసారి నా హృదయపూర్వక క్షమాపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తర్వాత తాను పెట్టిన వీడియోను కూడా లలిత్ మోదీ డిలీట్ చేశాడు.
భారత ప్రభుత్వం ఏమంటుంది?
లలిత్ మోదీ వీడియోపై భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఎవ్వరినీ వదిలిపెట్టమని చెప్పింది. భారత చట్టాలకు అనుగుణంగా శిక్షిస్తామని హెచ్చరించింది. దేశ చట్టాల నుంచి తప్పించుకుని, భారత్ నుంచి పారిపోయిన అందర్నీ వెనక్కి రప్పించే విషయంలో మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం... దీనిపై అనేక దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం.. దీనికి సంబంధించిన ప్రక్రియలు ప్రస్తుతం కొసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో అనేక చట్టపరమైన అంశాలు ఉన్నాయి..వాటిని పరిగణలోకి తీసుకుంటూనే లలిత్ మోదీ, విజయ్ మాల్యాల్లాంటి వారిని భారత్ కు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
Follow Us