రూ.8 కోట్ల FDలు, 1.1 కిలోల బంగారం.. కాబోయే CJI ఆస్తుల వివరాలివే

కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన ఆస్తులకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి.

New Update
Suryakant as the new CJI

కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన ఆస్తులకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్‌కు, ఆయన భార్యకు కలిపి రూ.8 కోట్లకుపైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. పలుచోట్ల ఇండ్లు, స్థలాలు కలిగి ఉన్నారు. అంతేగాక 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపర్చారు. ఆ సమాచారం ప్రకారం..  జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు మీద మొత్తం 16 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రిసీట్స్‌ ఉన్నాయి. వడ్డీతో కలిపి వాటి విలువ రూ.4,11,22,395 గా ఉంది. ఆయన కుటుంబం పేరు మీద మరో 15 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు ఉన్నాయి. వాటి విలువ రూ.1,92,24,317 గా ఉంది. ఇంకా ఆయన సతీమణి పేరు మీద మరో 6 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రిసీట్స్‌ ఉన్నాయి. వడ్డీతో కలిపి వాటి విలువ రూ.1,96,98,377 గా ఉంది.

ఇక చరాస్తుల విషయానికి వస్తే.. జస్టిస్‌ సూర్యకాంత్‌ దగ్గర 100 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆయన భార్య 1000 గ్రాముల బంగారు నగలు కలిగి ఉన్నారు. అంటే వారి దగ్గర మొత్తం 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదేవిధంగా వారి దగ్గర 6 కిలోల వెండి సామాగ్రి కూడా ఉంది. అయితే కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ జస్టిస్ సూర్యకాంత్ దగ్గర సొంత వాహనం లేదు. అతని భార్యకు వ్యాగనార్ కారు మాత్రమే ఉంది.

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. చండీగఢ్‌లోని సెక్టార్ 10లో జస్టిస్‌ సతీమణి పేరుమీద ఒక ఇల్లు, పంచకుల జిల్లాలోని గోల్పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి, న్యూచండీగడ్‌లోని 500 చదరపు గజాల స్థలం, న్యూఢిల్లీలోని జీకే-1లో 285 చదరపు గజాల ఇల్లు, గురుగ్రామ్‌లో 300 చదరపు గజాల స్థలం, చండీగడ్‌లోని సెక్టార్‌ 18-సీలో 192 చదరపు గజాల స్థలం కలిగి ఉన్నారు.

అదేవిధంగా హిసార్ జిల్లాలోని పెట్వార్ గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక ఆయన ఇద్దరు కుమార్తెల దగ్గర కూడా 100 గ్రాముల చొప్పున బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేగాక పెద్ద కుమార్తె పేరు మీద రూ.34,22,347 విలువచేసే 8 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. చిన్న కుమార్తె రూ.25,20,665 విలువచేసే ఏడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు కలిగి ఉంది.

కాగా భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ ఆర్ గవాయ్ గత సోమవారం తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. దాంతో ఆయన భారత 53వ ప్రధాన న్యాయమూర్తి కావడానికి మార్గం సుగమం అయింది. నవంబర్ 23న గవాయ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ కోరుతూ న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థన మేరకు ఈ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే జస్టిస్ సూర్యకాంత్ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడం దాదాపు ఖరారైనట్టేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు