/rtv/media/media_files/2025/12/03/calcutta-high-court-sensational-verdict-on-32000-teachers-appointments-in-recruitment-scam-case-2025-12-03-18-09-45.jpg)
Calcutta High Court Sensational verdict on 32000 Teachers Appointments In Recruitment Scam Case
Teacher Recruitment Scam: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. 9 ఏళ్ల నుంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వాళ్లని ఇప్పుడు తొలగిస్తే వాళ్ల కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి హైకోర్టు తీర్పును స్వాగతించారు. 32 వేల మంది ప్రైమరీ పాఠశాల టీచర్ల ఉద్యోగాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. టీచర్లకు, ప్రాథమిక విద్యా మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2014 ఉపాధ్యయ అర్హత పరీక్ష అనంతరం నియామక ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. 2023లో దీనిపై విచారణ జరగగా 32 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సింగ్ బెంచ్ తీర్పునిచ్చింది. 3 నెలల్లోపు కొత్త నియామక ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read: టార్గెట్ పశ్చిమ బెంగాల్.. SIR పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఆ తర్వాత ఈ కేసును విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై స్టే విధించింది. కొత్త నియాక ప్రక్రియను పూర్తి చేసేందుకు 6 నెలల సమయానికి పర్మిషన్ ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తుది విచారణ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని సూచించింది. చివరికి తాజాగా దీనిపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఆ 32 వేల మంది టీచర్ల నియామకాలు చెల్లుతాయంటూ తీర్పు వెలువరించింది.
ఇదిలాఉండగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా అధికార టీఎంసీ టీచర్ల నియామకం కుంభకోణంపై విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆ పార్టీకి ఊరట లభించింది.
Follow Us