Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్‌.. భద్రతా సిబ్బంది ఖాతాల్లో రూ.కోటి జమ

అస్సాం గాయకుడు జుబీన్‌ గార్గ్‌ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జుబీన్‌ గార్గ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి లావాదేవీలు జరిగినట్లు తేలింది.

New Update
zubeen garg

Zubeen Garg

Zubeen Garg :  అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌(Zubeen Garg) మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆయన ఇటీవల సింగపూర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మొదట ఊపిరి ఆడక చనిపోయాడని అనుకున్నా ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆయపై విష ప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జుబీన్‌ గార్గ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి  లావాదేవీలు జరిగినట్లు తేలింది.

జుబీన్‌ గార్గ్‌  మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిట్‌  దర్యాప్తు కొనసాగుతుంది. ఈక్రమంలోనే ఆయనకు చెందిన ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. అంతేకాక వారి బ్యాంకు ఖాతాలను అధికారులు  పరిశీలించారు. అయితే వారి ఖాతాల్లో దాదాపు రూ.కోటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో గార్గ్‌ మరణంలో భద్రతా సిబ్బంది ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈనేపథ్యంలో గాయకుడి మృతి కేసును ఆర్థిక కోణంలో కూడా దర్యాప్తు చేయాలని సిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు.

అయితే ఇటీవల  జుబీన్‌ బ్యాండ్‌మేట్‌ శేఖర్‌జ్యోతి గోస్వామిని సిట్‌ విచారించింది. తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. జుబీన్‌ గార్గ్‌ కు ఆయన మేనేజర్‌, ఫెస్టివల్‌ ఆర్గనైజర్‌ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జుబీన్‌ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్‌ ఏమాత్రం కంగారు పడలేదని వెల్లడించారు.  ఆయనకు వెంటనే వైద్యచికిత్స అందించకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. దీనిపై అధికారులు  లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబరు 19న సింగపూర్‌లో జుబీన్‌ మరణించిన విషయం తెలిసిందే. ఆయన స్కూబా డైవింగ్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత విహారనౌకలో ప్రమాదానికి గురయ్యాడని, జుబీన్‌ను సింగపూర్‌ ఆసుపత్రికి తరలించారని, అక్కడే మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. జుబీన్ గార్గ్‌కు చెందిన మరో బ్యాండ్‌మేట్ పార్థ ప్రతిమ్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, తోటి సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి కారణంగానే జుబీన్ గార్గ్ చనిపోయినట్లు ఆరోపించారు. హోటల్‌లో రాత్రంతా మందు పార్టీ చేసుకున్నారని.. కనీసం జుబీన్ గార్గ్‌ను నిద్రపోనివ్వకుండా చేశారని ఆరోపించారు. విశ్రాంతి తీసుకోకుండానే.. అంతలోనే విహారయాత్రకు తీసుకెళ్లారని.. జుబీన్ గార్గ్‌కు మూర్ఛ వ్యాధి ఉందన్న స్పృహ లేకుండా ఈతకొట్టేందుకు ఉసిగొల్పారని పార్థ ప్రతిమ్ గోస్వామి చెప్పుకొచ్చాడు. అత్యంత నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే జుబీన్ గార్గ్ చనిపోయారని తెలిపాడు. ఈ నిర్లక్ష్యపు తప్పును ఎప్పటికీ క్షమించబోను అన్నారు.

Also Read :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవీన్ యాదవ్ ను అడ్డంగా ఇరికించిన రఘునందన్.. ఏం జరగబోతోంది?

Advertisment
తాజా కథనాలు