/rtv/media/media_files/2024/12/23/C2BfqAJHl8qu5qUXvGtM.jpg)
Bengaluru Crime News
Bengaluru Crime News: మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసే ఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. సమాజంలో మానవ విలువలు పతనమవుతున్న తీరును కళ్ళ ముందు కట్టింది. చిన్నారులను సైతం కర్కశంగా చంపుతారా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకునేలా చేసింది. రోజురోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడం సమాజంలో విలువ పతనాన్ని తెలియజేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఓ 13 ఏళ్ల బాలుడి దారుణ హత్య కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం ట్యూషన్ కోసం వెళ్లిన నిశ్చిత్ (13) అనే బాలుడు గురువారం కాలిపోయిన స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. బాలుడు కనిపించకుండా పోయాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణం వెలుగులోకి రావడం విషాద కరం.
డబ్బు కోసం బాలుడి ప్రాణాలు..
నిశ్చిత్ బెంగళూరులోని క్రైస్ట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అరకెరె 80 ఫీట్ రోడ్‌లోని తన ఇంటి నుంచి ట్యూషన్‌కి వెళ్లాడు. అయితే రాత్రి 7:30 దాటినా కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనతో ట్యూషన్ టీచర్‌ను సంప్రదించారు. తమ కుమారుడు సకాలంలోనే ట్యూషన్ నుంచి వెళ్లిపోయాడని టీచర్ చెప్పడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. పరిచయస్తులు, తమ కుమారుడి స్నేహితులు, ఇతర తెలిసిన చోట్ల బాలుడి ఆచూకీ గురించి ఆరా తీశారు. కుమారుడి కోసం వారు వెతుకుతున్న సమయంలో అరకెరె ఫ్యామిలీ పార్క్ సమీపంలో నిశ్చిత్ సైకిల్ వారికి కనిపించింది. అదే సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందులో బాలుడిని కిడ్నాప్ చేశామని, రూ. 5 లక్షలు ఇస్తే వదిలిపెడతామని దుండగులు నిశ్చిత్ తల్లిదండ్రులకు డిమాండ్ చేశారు. వెంటనే బాలుడి తండ్రి జేసీ అచిత్ హులిమావు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
వెంటనే రంగంలోకి దిగిన హులిమావు పోలీసులు.. దుండగుల ఫోన్ కాల్ ట్రేస్ చేయడం ప్రారంభించారు. విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో గురువారం కగ్గలిపుర రోడ్డులోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో నిశ్చిత్ కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇది కేవలం కిడ్నాప్ కేసు కాదని, దీని వెనుక కుట్రపూరితమైన ఉద్దేశం ఏమైనా ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమారుడు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో విగత జీవిగా కనిపించడాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి బంధుమిత్రులతోపాటు వారు నివాసం ఉంటున్న ప్రాంతమంతా ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న కన్న కొడుకుకు దుండగుల దుశ్చర్య కారణంగా కాలి శవమై నందుకు ఆ తల్లిదండ్రుల మనసు తల్లడిల్లిపోయింది. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన వారికి కఠిన శిక్ష పడాలని పోలీసులను ఆ తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుని.. ఈ దారుణానికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: జడ్చర్లలో ఘోరం.. ఏడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం!
( crime | crime news | Latest News | telugu-news)