MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీ(BJP)లోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు. తనపై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను పార్టీ మారుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. రాజకీయాలకు దూరంగానైనా ఉంటాను కానీ ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
హిందువుల కోసం పనిచేస్తా
తాను హిందువుల కోసమే పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూస్తానన్నారు. తెలంగాణను పూర్తి హిందు రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని రాజాసింగ్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, త్వరలోనే తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్.. బీఆర్‌ఎస్ (BRS) గోషామహల్ టికెట్ ఎంఐఎం (MIM) చేతిలో ఉందని ఆరోపంచారు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి టికెట్ ఇవ్వమంటే కేసీఆర్ (KCR) వాళ్లకు ఇస్తారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్... మజ్లిస్ తో పొత్తులేకుండా గెలవండి చూద్దాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ కుట్రదారి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే హైదరాబాద్‌లో మజ్లిస్‌తో పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ బాగోతాలు బయటపెట్టే రోజులు ముందు ఉన్నాయని రాజాసింగ్ హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్పుతారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.
Also Read: బీజేపీ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి వెయ్యి మంది కమలదళం