Minister Uttam Kumar: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కానీ, అంతకుముందే 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.38 వేల కోట్ల అంచనాతో కాంగ్రెస్ సర్కార్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును కేసీఆర్ పక్కకు నెట్టారని మంత్రి విమర్శించారు.
తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని, కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. దిల్లీలోని ఎన్డీఎస్ఏ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రెండున్నర గంటలపాటు చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఏం చర్యలుతీసుకోవాలి? భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలని అన్న విషయంలో చర్చించామని, సోమవారం ఇంజినీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయని వివరించారు.
ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని భావించారన్న మంత్రి ఉత్తమ్, కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 65 టీఎంసీలు ఎత్తిపోశారన్నారు. ప్రాజెక్ట్లోని అన్ని పంపులు నడిస్తే కరెంటు బిల్లు రూ.13వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే, కరెంట్ బిల్లు రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు వివరించారు.
మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని, ఎవరో బాంబు పెట్టి ఉంటారని సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని దుయ్యబట్టారు. కాళేశ్వరం విషయంలో ఏం చేయాలనే దానిపై ఇంజినీర్లతో చర్చిస్తున్నామన్న మంత్రి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు ముందుకెళ్తున్నట్లు వివరించారు. రిపేర్లు చేస్తే, కాళేశ్వరం పనికి వస్తుందేమో పరిశీలిస్తున్నామని, బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలాలని ఇంజినీర్లు చెప్పారని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గేట్లు ఎత్తాలని ఎన్‌డీఎస్‌ఏ చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
బీఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు దుర్వినియోగం కాకూడదని భావిస్తున్నామన్నారు. మరమ్మతులు చేసైనా ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. అన్నారం బ్యారేజీలో భారీగా సీపేజీ ఉందన్న ఆయన, ఏదైనా సరే నిపుణుల కమిటీ సూచనల ప్రకారమే ముందుకెళ్తామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద అదనంగా ఒక ప్రాజెక్టు నిర్మించి తీరుతామని, గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో నీరు తరలించేలా నిర్మిస్తామని తెలిపారు. కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తే, దానిని కొనసాగిస్తామని మంత్రి వివరించారు.
Also Read:Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి