Tollywood Drugs Case: సినీ పరిశ్రమల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా మామూలు అయిపోయింది ఇప్పుడు. అది తప్పు, ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఎలాగో ఒకలా వాటిని వాడడం, విక్రయాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఈ డ్రగ్స్ విషయం చాలా సార్లు కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు, నటులు చాలా మందిని ఈ విషయంలో విచారించడం కూడా జరిగింది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మత్తు పదార్ధాల వినియోగం వ్యవహారం మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (TSNAB) పోలీసులు విచారించగా....తెలుగు సినీ పరిశ్రమకు, డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారు పలువురికి నైజీరియన్లతో సంబంధాలున్నాయిని...వారిదగ్గర నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయిని తెలిసింది.
విచారణలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముగ్గురు నైజీరియన్లను, మహబూబ్ నగర్ మాజీఎంపీ విఠల్ రావు కుమారుడు దేవరకొండ సురేశ్ రావు, దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న రాంచంద్ మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 11కోట్ల విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, ఎక్టృసీ మాత్రలను స్వాధీనంచేసుకున్నారు. ఇక హీరో నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి, హైదరాబాద్ స్నార్ట్ పబ్ (Snort Pub) యజమాని సూర్యతో పాటూ మరో 5గురు నైజీరియన్లు పరారీలో ఉన్నారు.
బాలాజీ అరెస్ట్ తో బయపడిన వ్యవహారం...
డ్రగ్స్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ముందుగా బాలాజీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని ద్వారా మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న నిర్మాత వెంకటరత్నారెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మురళిని అరెస్ట్ చేశారు. తరువాత వారి ఫోన్లలో డేటా, సమాచారాల ఆధారంగా నైజీరియన్ అమోబీ, మైఖేల్, థామస్ లతో పాటూ దేవరకొండ సేరుష్, రాంచంద్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. రాంచంద్ ద్వారానే నటుడు నవదీప్ కు డ్రగ్స్ అందాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి నవదీప్ వినియోగదారుడిగానే ఉన్నాడు. అతనిని విచారిస్తే కానీ మిగతా వివరాలు తెలియవు. నవదీప్ (Navdeep), షాడో నిర్మాత ఉప్పలపాటి రవి, సూర్య, బిస్ట్రో, టెర్రాకేఫ్ యజమాని అర్జున్, విశాఖ వాసి కలహర్రెడ్డిలు పరారీలు ఉన్నారు. వెంకట రత్నారెడ్డి, సందీప్, సూర్య, కలహర్ రెడ్డి, కృష్ణప్రణీత్ లు బాలాజీ నుంచి డ్రగ్స్ తీసుకుని పార్టీలు నిర్వహించేవారని సీవీ ఆనంద్ చెబుతున్నారు.
డ్రగ్స్ ఎలా వస్తున్నాయి...
ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారుడు బాలాజీ. ఇతను నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని వారి ద్వారా డ్రగ్స్ దందా నడిపించాడు. నైజీరియాకు చెందిన అమోబీ చుక్వుడి బెంగళూరులోని యెలహంక ఫుట్ బాల్ క్లబ్ లో సభ్యుడు. అఖిల భారత నైజీరియా విద్యార్ధి, కమ్యునిటీ సంఘం సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ తమ దేశస్థులకు బెయిల్ ఇప్పించేందుకు, స్వదేశానికి పంపేందుకు అమోబీ నిధులు సేకరిస్తుంటాడు. అంతేకాదు ఇతను డ్రగ్ డీలర్ కూడా. మైఖేల్ , థామస్ అనఘా కలూ అనే మరో ఇద్దరు నైజీరియన్లతో కలిసి బెంగళూరు, హైదరాబాద్ లలో పరిచయస్థులకు డ్రగ్స్ అమ్ముతుంటాడు. ఈ ముగ్గురు నైజీరియన్లకు ముందు విశాఖ వాసి రామ్ కిశోర్ అనే డ్రగ్ స్మగ్లర్ తో పరిచయం ఏర్పడింది. ఇతనే నెల్లూరుకు చెందిన కాపా భాస్కర్ బాలాజీకి నైజీరియన్లను పరిచయం చేశాడు. ఆ తర్వాత నుంచి బాలాజీ నైజీరియన్ల దగ్గర డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో పార్టీలు నిర్వహించేవాడు. వీటికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే కిక్, ఢమరుకం, బిజినెస్ మేన్, ఆటోనగర్ సూర్య తదితర సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డికి కూడా బాలాజీతో స్నేహం ఏర్పడింది. వెంకట రత్నారెడ్డి కూడా బాలాజీ ద్వారానే డ్రగ్స్ తెప్పించుకునేవాడు. స్నాప్ ఛాట్ లో గాడ్స్ హెడ్ అనే పేరుతో బాలాజీ డ్రగ్స్ విక్రయాలు చేసేవాడు.
ఈ మొత్తం వ్యవహారంలో మోడల్ శేత అనే ఆమె కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె కూడా పరారీలో ఉంది. మరోవైపు తానేమీ పారిపోలేదని..ఇక్కడే ఉన్నాని అంటున్నాడు నటుడు నవదీప్. పోలీసులు చెప్పిన నవదీప్ తాను కాదని వాదిస్తున్నాడు.
Also Read: గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!