/rtv/media/media_files/2025/11/04/kartik-purnima-2025-2025-11-04-15-27-15.jpg)
Kartik Purnima 2025
హిందూ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన పౌర్ణమి రోజులలో ఒకటిగా చెప్పే కార్తీక పౌర్ణమి సనాతన ధర్మంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ పౌర్ణమి కార్తీక మాసంలో వస్తుంది. ఇది సాధారణంగా నవంబర్‌లో ఉంటుంది. ఈ పవిత్రమైన రోజును పవిత్ర స్నానం, ఉపవాసం, గంగా ఘాట్‌ల వద్ద దీపాలు వెలిగించి భక్తులు జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు వేకువజామునే నిద్రలేచి, గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి దీపాలు వెలిగించి.. శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడిని పూజిస్తారు. కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా కూడా జరుపుకుంటారు. దేవతలు గంగా నది ఒడ్డున దీపావళి జరుపుకోవడానికి భూమిపైకి వస్తారని నమ్మే రోజు ఇది. 2025వ సంవత్సరంలో.. కార్తీక పౌర్ణమి బుధవారం నవంబర్ 5న జరుపుకోనున్నారు. అయితే కార్తీక పూర్ణిమ 2025 నవంబర్ 5న ఉపవాస నియమాలు, చంద్రోదయ సమయం ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి 2025 తిథి-సమయం:
హిందూ పంచాంగం ప్రకారం.. పౌర్ణమి తిథి నవంబర్ 4 మంగళవారం రాత్రి 10:36 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 5, 2025 బుధవారం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో పండుగను జరుపుకునే సంప్రదాయం ప్రకారం.. కార్తీక పౌర్ణమిని నవంబర్ 5 బుధవారం నాడు జరుపుకుంటారు. స్నానం మరియు దానం కోసం శుభ సమయం అయితే నవంబర్ 5న ఉదయం 4:52 గంటల నుంచి ఉదయం 5:44 గంటల మధ్య మంచిగా ఉందని, ఉదయం 7:58 గంటల నుంచి 9:20 గంటల వరకు, సాయంత్రం 5:15 గంటల నుంచి 7:05 గంటల వరకు మంచిగా ఉందని పండితులు చెబుతున్నారు. భక్తులు ఈ శుభ సమయంలో గంగా నదిలో స్నానం చేయడం, దానం చేయడం ద్వారా శ్రేయస్సు.. పవిత్రత దైవ కృప లభిస్తాయని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు
కార్తీక పౌర్ణమి రోజు ఉదయం వేళ గంగా లేదా ఏదైనా శుభ్రమైన జల వనరులలో స్నానం చేయడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భక్తులు సూర్యుడికి నీటిని సమర్పించి, సానుకూల శక్తి కోసం తమ ఇళ్లలో గంగాజలం చిలకరిస్తారు. శుభారంభం కోసం మొదట గణేశుడిని పూజించి.. ఆ తర్వాత విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి దేవిని పూలు, అగరబత్తులు, దీపాలతో పూజించాలి. ఈ రోజున సత్యనారాయణ కథ వినడం లేదా చదవడం చాలా శుభప్రదంగా చెబుతారు. సాయంత్రం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద, తులసి మొక్క దగ్గర, పూజ గదిలో, ఏదైనా నీటి వనరుల దగ్గర దీపాలను వెలిగించాలి. ఈ రోజు ఉపవాసం పాటించడం వలన ఆత్మ శుద్ధి అవుతుందని.. దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమిని సంవత్సరంలో అత్యంత పవిత్రమైన, ఫలవంతమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. గంగానదిలో పవిత్ర స్నానం, దానం చేయడం, దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశించి.. మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు. ఈ రోజున భక్తులు వారి సామర్థ్యాన్ని బట్టి పేదలకు, బ్రాహ్మణులకు వస్త్రాలు, ధాన్యం, నువ్వులు, నెయ్యి, బియ్యం దానం చేస్తారు. దానం చేయడం వలన జీవితంలో శాంతి, శ్రేయస్సు, దైవ ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: పురుషులు Vs స్త్రీలు.. డిప్రెషన్కు గురైతే ఎవరు ఎక్కువగా అరుస్తారో తెలుసా..?
Follow Us