/rtv/media/media_files/2025/09/04/ganesh-visarjan-muhurat-2025-2025-09-04-17-26-10.jpg)
Ganesh Visarjan Muhurat 2025
గణేశ్ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భక్తులంతా ఆనందోత్సాహాల మధ్య కొలువుదీరిన బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అనంత చతుర్దశి సెప్టెంబర్ 6, 2025న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుసరించాల్సిన విధానం, శుభ ముహూర్తాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వీడ్కోలు పలికేందుకు శుభ ముహూర్తాలు..
శాస్త్రాల ప్రకారం.. శుభ సమయంలోనే గణపతి నిమజ్జనం చేయడం చాలా శ్రేయస్కరం. చతుర్దశి తిథి సెప్టెంబర్ 6, 2025 తెల్లవారుజామున 3:12 ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 1:41 ముగిస్తుంది. ఉదయం ముహూర్తం 07:36 నుంచి 09:10 వరకు, మధ్యాహ్నం ముహూర్తం 12:19 నుంచి సాయంత్రం 05:02 వరకు సాయంత్రం ముహూర్తం 06:37 నుంచి రాత్రి 08:02 వరకు, రాత్రి ముహూర్తం 09:28 నుంచి అర్ధరాత్రి 01:45 వరకు ఉషఃకాల ముహూర్తం సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 04:36 నుంచి ఉదయం 06:02 వరకు ఉంది. గణేశ్ ఉత్సవాలు 10 రోజులు పూర్తి కావడంతో అనంత చతుర్దశి నాడు బప్పాకు వీడ్కోలు పలకడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ఎందుకంటే గణేశ్ చతుర్థి నాడు విగ్రహాన్ని 10 రోజుల పాటు ప్రతిష్ఠిస్తామని సంకల్పం తీసుకుంటాం. ఆ సంకల్పం పూర్తి చేయాలంటే.. సరైన సమయానికి.. సరైన పద్ధతిలో విసర్జనం చేయడం అవసరం. లేని పక్షంలో దోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ముహూర్తంలో గణపతికి చివరి పూజ చేయాలి. దూర్వ, పూలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు సమర్పించి, ఓం గం గణపతయే నమః వంటి గణేశ్ మంత్రాలను పఠించాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆర్తి ఇచ్చి గణపతి బప్పా మోరియా వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ నినాదాలు చేస్తూ బప్పాను నిమజ్జనానికి తీసుకెళ్లాలి. నిమజ్జనం కోసం పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. ఇంట్లో విసర్జనం చేస్తే.. నిమజ్జనం తర్వాత ఆ నీటిని మొక్కల్లో పోయాలి. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో విసర్జనం చేసి బొజ్జ గణపయ్య దీవెనలు పొందాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏంటో తెలుసా..?