/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-08-27-07-11-21.jpg)
Ganesh Chaturthi 2025
గణేశ భక్తులకు శుభ సమయం వచ్చేసింది. విఘ్నేశ్వరుడి పండుగ వినాయక చవితి ఈ ఏడాది ఆగస్టు 27 వచ్చింది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగ ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగి అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. అయితే ముహూర్తం, పూజా సమయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆగస్టు 27 బుధవారం మధ్యాహ్నం 1:54 వరకు చవితి తిథి ఉంటుంది. వినాయక చవితి రోజున గణపతి పూజకు మంచి అనువైన శుభ ముహూర్తం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈ 2 గంటల 34 నిమిషాల సమయం విగ్రహ ప్రతిష్టాపనకు అత్యంత అనుకూలమైనదిగా పండితులు చెబుతున్నారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులు..
ఈ శుభ సమయంలో గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిని మామిడి తోరణాలు, పూలతో అలంకరించాలి. పూజకు ముందు బియ్యం, పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి, చక్కెర, తేనె, ఉప్పు, ధూపం, దీపం, అగరుబత్తీలు, నైవేద్యం కోసం ఉండ్రాళ్ళు, పాయసం సిద్ధం చేసుకోవాలి. పసుపుతో చేసిన గణపతిని పల్లెలో పెట్టి తమలపాకులపై ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత వినాయక వ్రతకల్పం చదివి పూజను పూర్తి చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి చేస్తేనే పుణ్యం.. లేదంటే ఏడు లోకాల పాపాలు మీ చుట్టే!
గణేశ ప్రతిమ ముఖం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం. ఆగస్టు 26 సాయంత్రం 01:54 నుంచి రాత్రి 08:29 వరకు మరియు ఆగస్టు 27 ఉదయం 09:28 నుంచి రాత్రి 08:57 వరకు చంద్రుడిని చూడకూడదు. ఇంట్లో గణపతిని ప్రతిష్టించడానికి ఎడమ వైపు తొండం ఉన్న గణపతి విగ్రహాన్ని ఎంచుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇంటిలో కూర్చున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శ్రేయస్కరం. మట్టి గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుని ఆ భగవంతుడిని పూజిస్తే మనకు అన్ని విధాలా శుభాలు కలుగుతాయి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఇంట్లో ఏ రంగు గణపతిని ప్రతిష్టిస్తే మంచిదో తెలుసా..?