/rtv/media/media_files/2025/10/15/dhanteras-2025-2025-10-15-09-25-17.jpg)
Dhanteras 2025
ధంతేరాస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు వంటి శుభప్రదమైన వస్తువులను కొనుగోలు చేయాలని పండితులు అంటుంటారు. అయితే ఈ పర్వదినాన కొన్ని వస్తువులను కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇలాంటి అశుభకరమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన దురదృష్టం, ఆర్థిక నష్టాలు కలుగుతాయని అంటున్నారు. అయితే ధంతేరాస్ నాడు ఇంటికి ఏయే వస్తువులు తీసుకురాకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Health Tips: పార్కిన్సన్ వ్యాధి నాడి పట్టేసిన శాస్త్రవేత్తలు.. ఎలానో మీరూ తెలుసుకోండి!!
ఇనుము, ఉక్కు, అల్యూమినియం
ధంతేరాస్ రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కొనడం అశుభకరంగా భావిస్తారు. ఇనుమును శని గ్రహంతో ముడిపెడతారు. కాబట్టి ఈ రోజున శని ప్రభావం ఉండే వస్తువులు కొనకూడదని నమ్ముతారు. అదే విధంగా ఇనుము మరొక రూపమైన ఉక్కు, అల్యూమినియం పాత్రలను కూడా కొనడం మంచిది కాదని పండితులు అంటున్నారు. ముఖ్యంగా అల్యూమినియం దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పాత్రలు కొనాలనుకుంటే ఇత్తడి, రాగి, కాంస్యం వంటి లోహాలను ఎంచుకోవాలి.
పదునైన వస్తువులు
ధన త్రయోదశి రోజున కత్తులు, కత్తెరలు, బ్లేడ్‌లు, కట్టర్లు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. ఈ పదునైన వస్తువులు రాహువు లేదా అరిష్ట సంకేతాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని కొనడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లు అవుతుందని నమ్ముతారు. అలాగే గాజు సామాను లేదా ప్లాస్టిక్ వస్తువులు కూడా కొనకూడదు. గాజును కూడా రాహువుతో చూస్తారు. దీన్ని ఇంటికి తీసుకురావడం వల్ల సుఖ:శాంతులు ఉండవని పండితులు అంటున్నారు. వీటివల్ల సంపద తగ్గుతుందని చెబుతున్నారు.
నలుపు రంగు వస్తువులు
ఈ పండుగ రోజున నలుపు రంగు వస్తువులను, వస్త్రాలను కొనడం లేదా ధరించడం కూడా మానుకోవాలి. నలుపు రంగు చీకటిని, దురదృష్టాన్ని సూచిస్తుందని, లక్ష్మీదేవిని పూజించే ఈ శుభ దినాన దూరంగా ఉండాలని చెబుతారు. వీటితో పాటు ఖాళీ పాత్రలు కొంటే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దని అంటున్నారు. ఖాళీ పాత్రలు సంపద లేకపోవడాన్ని సూచిస్తాయి. కాబట్టి వాటిని ధాన్యాలు, బియ్యం లేదా నీటితో నింపి తీసుకురావడం శుభకరం అని పండితులు అంటున్నారు. ఈ రోజున నూనె లేదా నెయ్యి బయటి వారికి దానం చేయడం లేదా అమ్మడం కూడా శ్రేయస్కరం కాదని నమ్ముతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.