/rtv/media/media_files/2025/10/27/kartika-bath-2025-10-27-11-45-44.jpg)
Kartika bath
కార్తీక మాసం అత్యంత పవిత్రమైన నెలగా చెబుతారు. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపారాధన చేస్తే అపారమైన శక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ మాసంలో భక్తులు శివ కేశవుల, అంటే శ్రీ మహావిష్ణువు, శివుని అనుగ్రహం కోసం తపిస్తారు. పురాణాల ప్రకారం.. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం కార్తీక స్నానం. నదీ తీరాలలో, చెరువుల వద్ద తెల్లవారుజామున భక్తితో చేసే ఈ స్నానం వెనుక గొప్ప శక్తి దాగి ఉంది. పగటిపూట మనం చేసే స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే.. కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే స్నానం ఆత్మను శుద్ధి చేస్తుందని పెద్దలు చెబుతారు.
పాపాలను హరించే కార్తీక స్నానం..
కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ మాసంలో చేసే ప్రతి మంచి పని అపారమైన ఫలాలను ఇస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ నెలలో నదీ జలాల్లో కొలువై ఉంటారని పండితులు చెబుతారు. అందుకే కార్తీక స్నానం కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాక.. ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇస్తుంది. పురాణాల ప్రకారం.. ఈ నెలలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో (గంగ, గోదావరి, కృష్ణ వంటివి) స్నానం చేస్తే పూర్వ జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.
ఇది కూడా చదవండి: ఒక్క నెయ్యి ఏడు ప్రయోజనాలు.. ఎలా ఉపయోగించాలో ఆయుర్వేదంలో చెప్పబడింది!!
పద్మ , స్కంద పురాణం వంటి గ్రంథాలలో కార్తీక స్నానం యొక్క విశిష్టత వివరంగా వర్ణించబడింది. బ్రహ్మ దేవుడు స్వయంగా కార్తీక స్నానం యొక్క గొప్పతనాన్ని గురించి ప్రస్తావించారని చెబుతారు. పురాణాల ప్రకారం ఎవరైతే కార్తీక మాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి దీపాన్ని వెలిగిస్తారో. ఆ వ్యక్తికి అన్ని పుణ్య క్షేత్రాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్నానం ధనం, ఆరోగ్యం, దీర్ఘాయువును అందిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఉపవాసం ఉండి దీపారాధనతోపాటు కార్తీక స్నానం చేస్తే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేనివారు లేదా నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు.. ఇంట్లోనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి ఆకులు వేసి గంగా, గోదావరి, కృష్ణ నమః అని ప్రార్థిస్తూ స్నానం చేసినా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే క్యాన్సర్ ఉన్నట్లే!
Follow Us