బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి షాక్ ఇచ్చింది. రేపు తాను విచారణకు హాజరుకావడం లేదంటూ సీబీఐకి లేఖ రాసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బాధ్యతల్లో బిజీగా ఉంటానని తెలిపారు. రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని తేల్చి చెప్పారు.
Also Read: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్ రావు ఫైర్
తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏదైన సమాచారం కావాలంటే వర్చువల్ విధానంలో హాజరవుతానని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదంటూ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నోటీసులు జారీ చేయడంపై కవిత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని.. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టుకు వెళ్లానని.. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని.. గతంలో కూడా సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించినట్లు చెప్పారు. కానీ.. 15 నెలల విరామం తర్వాత విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు వంటివి అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆరోపిస్తున్నారు. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉండటం వల్ల ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనకుండా అడ్డు కలిగిస్తుందన్నారు.
Also Read: ఆరు ఎంపీ స్థానాలు ఖరారు చేసిన బీజేపీ .. అభ్యర్థులు వీళ్లే