Jyotirao Phule Biography: ఇప్పుడంటే మహిళలు స్కూల్స్‌కు వెళ్తున్నారు. ఉన్నత విద్యకు విదేశాలకూ వెళ్తున్నారు.. కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆడపిల్ల పాఠశాలలో అడుగుపెడితే పాపంగా భావించేవారు. మహిళలు ఇంటిపనులకు, వంట పనులుకే పరిమితమయ్యేవారు. వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే సంఘం నుంచి బహిష్కరించేవారు. అలాంటి రోజుల్లో అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే (Jyotirao Phule). ఏప్రిల్ 11న ఆయన జన్మదినం సందర్భంగా ఫూలే జీవిత చరిత్ర, ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!
జ్యోతిరావ్ గోవిందరావు ఫూలే 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక జ్ఞానోదయుడు, ఆలోచనాపరుడు, సంఘ సేవకుడు, రచయిత, తత్వవేత్త, విప్లవ కార్యకర్త. ఆయనను మహాత్మా ఫూలే , జోతిబా ఫూలే అని కూడా పిలుస్తారు. ఆయన తన జీవితమంతా మహిళలకు విద్యాహక్కు కల్పించడంలో, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు. ఫూలే సమాజాన్ని మూఢ నమ్మకాల నుంచి విముక్తి చేయాలన్నారు. ఏప్రిల్ 11, 1827లో జన్మించిన ఫూలే నవంబర్ 28, 1890న 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఈ జీవిత ప్రయాణంలో మహిళల పురోగతికి ఆయన సాధించిన విజయాలు, చేసిన కృషి అనన్యసామాన్యమైనవి!
Also Read: మీ దగ్గర రూ.5లక్షలు ఉంటే..వీటిలో పెట్టుబడి పెట్టండి!
జ్యోతిబాకు 1840లో సావిత్రీబాయితో వివాహం జరిగింది. మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మరోవైపు కుల వ్యవస్థ వ్యాపిస్తున్న కాలం కూడా అదే. అటు స్త్రీ విద్య పట్ల ఉన్న దురాచారాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి జ్యోతిబా ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 1848లో బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. ఆయన భార్య సావిత్రీబాయి పూణేలో ప్రారంభించిన ఈ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది . దీంతో జ్యోతిబా ఫూలే తన పాఠశాలను మూసివేయవలసి వచ్చింది.
అయితే దీని తర్వాత దళితులు, అణగారిన వారికి న్యాయం చేసేందుకు జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. ఇది సామాజిక మార్పు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్థాపించబడింది. శూద్రులు-అతిశూద్రులకు న్యాయం చేయడం, విద్య కోసం వారిని ప్రోత్సహించడం, అణచివేత నుంచి విముక్తి కల్పించడం, అణగారిన వర్గాల యువతకు పరిపాలనా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైనవి దీని ప్రధాన లక్ష్యాలు. ఆయన సామాజిక సేవకుగానూ 1888లో ముంబైలో జరిగిన సమావేశంలో జ్యోతిరావు ఫూలేకి మహాత్మా బిరుదు లభించింది.
ఫూలే సంస్కరణ ఉద్యమాల కారణంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు. సామాజిక, మేధో స్థాయిలో బానిసత్వం నుంచి ప్రజలను విడిపించే ఎన్నో ఉద్యమాలు ఆయన హయంలో పురుడుపోసుకున్నాయి. అవి ఈనాటికి ప్రతి రంగంలోనూ కొనసాగుతున్నాయి. ఫూలే ఆలోచనలు స్వాతంత్ర్య పోరాటంలోనూ భారతీయుల శక్తిగా మారాయి. ప్రజల్లో కొత్త ఆలోచనలు మొదలకు కారణమయ్యాయి. జ్యోతిరావు గోవిందరావు ఫూలే నవంబర్ 28, 1890న పూణేలో మరణించారు. ఆయన ఈ లోకాన్ని వీడి 135ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆయన ఆదర్శాలు నేటి మహిళలను ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి.
Also Read:IPL_2024: శుభ్‌మన్‌గిల్ కు అరుదైన రికార్డ్..చిన్న వయసులోనే ఘనత