భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక మన నుంచి పాకిస్థాన్ విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1947 నుంచి 1950 వరకు హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఎలా కంట్రోల్ అయ్యింది ?. ప్రస్తుత బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అలర్లకు అప్పటి హింసాత్మక ఘటనలకు ఏదైనా పోలిక ఉందా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నెహ్రూపై ఒత్తిడి
భారత్, పాకిస్థాన్ మధ్య మత ఘర్షణల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన మంత్రివర్గం ఈ హింసాత్మక ఘటనలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేశారు. హిందూ సంఘాలు కూడా నెహ్రూ టార్గెట్‌గా విమర్శలు చేశాయి. పాకిస్థాన్‌పై సైనిక చర్యకు డిమాండ్ చేశాయి. ఇలా చేస్తే హింస మరింత పెరుగుతుందని నేహ్రూ భావించారు. ఇందుకోసం దౌత్యపరమైన పరిష్కారం వైపు మొగ్గుచూపారు. పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌ను సంప్రదించారు. ఈ ఇద్దరూ కలిసి హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. నెహ్రూ ప్రయత్నాల వల్ల భారత్‌లో ముస్లింల లక్ష్యంగా దాడులు చాలావరకు కంట్రోల్‌లోకి వచ్చాయి. కానీ పాకిస్థాన్‌లో మాత్రం ఈ పరిస్థితి రాలేదు. దీంతో దౌత్యపరమైన మార్గాన్ని వీడి సైనిక చర్యకు దిగాలని నెహ్రూపై ఒత్తిడి వచ్చింది.
తరలివచ్చిన శరణార్థులు
1950 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు నెహ్రూ గట్టి హెచ్చరికలు చేశారు. తూర్పు పాకిస్థాన్‌లో జరుగుతున్న హింసాకాండపై భారత్ ఉదాసీనంగా ఉండకూడదని తేల్చిచెప్పారు. తూర్పు-పశ్చిమ పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి సాయుధ బలగాలను సమీకరించాలని భారత సైన్యానికి నెహ్రూ ఆదేశించారు. 1950 మార్చి ప్రారంభంలో పశ్చిమ సరిహద్దు వైపుగా భారత సాయుధ బలగాలు కదిలాయి. మరోవైపు నెహ్రూ తన దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సయమానికి హిందూ శరణార్థుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది.
కీలక ఒప్పందం
ప్రధాని నెహ్రూ ఓవైపు దౌత్య చర్చలను కొనసాగిస్తూనే సైన్యాన్ని కూడా యాక్టివ్ చేశారు. భారీ సైనిక సమీకరణకు పిలుపునిచ్చారు. కానీ భారత సైన్యం సమీకరణను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో వెంటనే పాక్ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించింది. దీంతో పాకిస్థాన్ దెబ్బకు దిగొచ్చింది. ఇండియాతో దౌత్యపరమైన ఒప్పందానికి అప్పటి పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అంగీకరించారు. 1950 ఏప్రిల్ 2న ఢిల్లీ వేదికగా నెహ్రూ- లియాఖత్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. దీనిప్రకారం భారత్-పాకిస్థాన్.. ఇరు దేశాలు కూడా తమ దేశాల్లో మైనార్టీ వర్గాల హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాయి. శరణార్థులకు సాయం చేయడం, హింసకు కారణమైన వారిని శిక్షించడం వంటి అనేక అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. అయితే భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మైనార్టీలను రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.