జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రను ఇప్పటివరకు రెండు విడతలు నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను విశాఖ పట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను విజయవంతం చేయండంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందన్నారు. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని తెలిపారు. నాయకులు, జనసైనికులు, వీర మహిళలు అంతా సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
కాగా వారాహి యాత్ర సందర్భంగా విశాఖలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వెల్లడించారు నాదేండ్ల మనోహర్.
ఈ సమావేశంలో జనసేన నేతలు కోన తాతారావు, టీ శివ శంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయకుమార్, పరుచూరి భాస్కర రావు, గడసాల అప్పారావు, అంగ దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, పి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, పీవీఎస్ఎన్ రాజు, వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు.. మంత్రి అంబటి రాంబాబు, జనసేన సైనికుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవన్ పై త్వరలోనే సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు 'బ్రో' టైటిల్ మాదిరిగా 'మ్రో' అనే టైటిల్ పెడతామని మంత్రి పేర్కొన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందనేది కూడా చెప్పారు మంత్రి అంబటి.
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ పై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల చేశారు. అంబటి వేషాధారణలో వచ్చిన జనసేన నేత, పూజలు చేసి షూటింగ్ చిత్రీకరణ ప్రారంభించారు.
త్వరలోనే మంత్రి అంబటి రాంబాబు జీవితంపై సినిమా పూర్తవుతుందని చెప్పారు. అయితే అంబటికి మంచి హీరోయిన్లు మాత్రం దొరకడం లేదన్నారు. త్వరలోనే రెడ్ లైట్ ఏరియాలో వెతికి మంచి నటిని తీసుకొస్తామని సెటైర్లు వేశారు. ఇననైనా పవన్ కళ్యాణ్ పై అనవసర మాటలు మానుకోవాలని సూచించారు.