Telangana BJP: తెలంగాణలో కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది. బీఆర్ఎస్ (BRS) లో టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్‌తో పాటూ బీజెపీ నేతలు కూడా అదే బాట పడుతున్నారా అంటే...అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజెపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పడం కూడా దీనికి ఊతమిస్తున్నాయి.
ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం బీజెపీలో ఓ వర్గానికి నచ్చలేదని తెలుస్తోంది. ఈటల చెప్పడం వల్లే బండి సంజయ్‌ను (Bandi Sanjay) కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది వారి ఆరోపణ. ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అవమానిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. తమను సంప్రదించకుండా... కొందరిని బీజేపీలో చేర్చుకోవడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఇలాంటి వారంతా బీజేపీ జాతీయ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తమను అధిష్టానం పట్టించుకోవడం లేదనేది వారి వాదన.
దీనికి సంబంధించి బీజేపీలో (Telangana BJP) ని అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రెండు, మూడుసార్లు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో అసంతృప్త నేతలంతా మీటింగ్ పెట్టకున్నారని సమాచారం. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావుతోపాటు పలువురు నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరంతా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతోపాటు పార్టీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ తమకు అనుకూలంగా స్పందించకపోతే తరువాత ఏం చేయాలి అన్న దాని మీద కూడా నేతలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కొంతమంది పార్టీని సైతం వీడేందుకు రెడీగా ఉన్నారని టాక్ నడుస్తోంది.
మరోవైపు బీజేపీ రెబల్స్ తెలంగాణ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత వారంతా కాంగ్రెస్లో చేరడానికి గ్రైండ్ ప్రిపేర్ కూడా చేసుకున్నారని సమాచారం. అందుకే.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని.. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతాయని టీపీసీసీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు.
ఇక బీజెపీ రెబల్స్ మీద కాంగ్రెస్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆపరేషన్ బీజెపీ అసమ్మతి పేరుతో బీజెపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీజెపీలో కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న నాయకులే టార్గెట్‌గా కాంగ్రెస్ అధిష్టానంపావులు కదుపుతోందని సమాచారం. వారం, పది రోజుల్లో ఫలాతాలుకనబడతాయని అంటున్నారు. అయితే బీజెపీ అసంతృప్తులుగా చెబుతున్నవారిలో వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy), విశ్వేశ్వర్రెడ్డిలు ఇప్పటికే తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. దానికి తోడు రెబల్ ఈరోజు బీజెపీ ఎన్నికల కమిటీలకు ఛైర్మన్‌లుగా వివేక్ , కోమటిరెడ్డి (Komatireddy), విజయశాంతి(Vijayashanti) లను ప్రకటించింది. అయితే ప్రధాని పాలమూరు, నిజామాబాద్ సభలకు కొంతమంది బీజెపీ నేతలు హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతానికి బీజెపీ నేతలు పార్టీ మారడం ఇంకా తర్జనభర్జనల్లోనే ఉంది. కానీ ఈ రెబల్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చని తెలుస్తోంది. ఈరోజు ప్రకటించిన కమిటీలు, వాటి పదవులతో రెబల్స్ సంతృప్తి పడతారా? లేక అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఈ క్రమంలో అసమ్మతి నేతలను కమలనాథులు బుజ్జగిస్తారా లేక వారిని వదిలించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ జాతీయ స్థాయి నేతలే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
Also Read: సీఎం కేసీఆర్ కు షాక్.. ఆయనపై పోటీకి 1016 మంది.. కారణమిదే?