Sheik Hasina: షేక్‌ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో కీలక మార్పులు..

బంగ్లాదేశ్‌లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
What are the consequences after Sheikh Hasina's Government Collapse in Bangladesh

What are the consequences after Sheikh Hasina's Government Collapse in Bangladesh

బంగ్లాదేశ్‌లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. దీంతో గత 15 ఏళ్లుగా సాగిన అవామీ లీగ్ ప్రభుత్వానికి తెరపడింది. ఆ దేశం నుంచి పారిపోయిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు అక్కడ జరిగిన రాజకీయ, సామాజిక మలుపుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.    

అధికారంలోకి వచ్చిన యూనస్‌ ప్రభుత్వం

షేక్ హసీనా బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయిన తర్వాత నోబెల్ విజేత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే హసీనా హయాంలో నియమించిన అధికారులను తొలగించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌  ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఐదుగురు న్యాయమూర్తులు రాజీనామా చేశారు. అలాగే నిరసనాకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో సహా పోలీస్ యూనిఫామ్‌, లోగోను మార్చాలని నిర్ణయించారు. చివరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీస్ లోగోను మార్చేశారు. నవంబర్‌లోయూనిఫాం మార్చారు. 

Also Read: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..ఎన్ కౌంటర్ లో  మావోయిస్టు అగ్రనేత మృతి

 విదేశీ విధానంలో మార్పులు 

హసీనా ప్రభుత్వం పడిపోయాక 1971 యుద్ధ తర్వాత ఎప్పుడూ లేని విధంగా బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌కు దగ్గరయ్యింది. దశాబ్దాల తర్వాత కరాచీ నుంచి చిట్టగాంగ్‌కు నేరుగా నౌకయాన సంబంధాలు పునరుద్ధరించారు. పాకిస్థాన్ నిర్వహించే అమాన్-25 వంటి నౌకాదళ విన్యాసాల్లో బంగ్లాదేశ్ పాల్గొంటోంది. అంతేకాదు పాక్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కానీ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాక్‌తో సంబంధాలు దగ్గరయ్యాయి. బంగ్లాదేశ్‌పై భారత్‌ దురాక్రమణకు పాల్పడితే దాడులు చేస్తామంటూ ఏకంగా పాకిస్థాన్‌కు చెందిన నాయకులు బహిరంగంగా ప్రకటన చేసే పరిస్థితికి ఇరుదేశాల మధ్య బంధాలు బలపడ్డాయి.

టర్కీకి చెందిన అత్యాధునిక డ్రోన్‌ టెక్నాలజీ కోసం కూడా బంగ్లాదేశ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశ పార్లమెంటరీ ప్రతినిధులతో యూనస్ సర్కార్‌ స్వయంగా చర్చలు జరుపుతోంది. మరోవైపు చైనాకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. బంగ్లాదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు, పెట్టుబడుల కోసం చైనాకు రెడ్‌ కార్పెట్ వేస్తున్నారు. భారత ప్రాజెక్టుల కంటే చైనా ప్రాజెక్టులకే యూనస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి సపోర్ట్ కోసం యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. 

షేక్ హసీనాకు మరణశిక్ష 

షేక్ హసీనా పారిపోయిన తర్వాత ఆమెపై  అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) బిగ్ షాక్ ఇచ్చింది. గతేడాది జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా పాల్పడ్డారంటూ నిర్ధారించింది. ఆమెను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది. ఆ తర్వాత హసీనాను బంగ్లాదేశ్‌ను రప్పించాలని యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు పలుమార్లు లేఖ రాసింది. కానీ భారత ప్రభుత్వం ఆమెను అప్పగించకూడదని భావిస్తోంది. 

ఉస్మాన్ హదీ హత్య 

బంగ్లాదేశ్‌లో యువనేత ఉస్మాన్ హదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టంలో హదీ కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది డిసెంబర్ 12న హదీ.. ఢాకాలోని పురానా పల్టాన్ ప్రాంతంలో తన ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం హదీని సింగపూర్‌కు తరలించగా డిసెంబర్ 18న అతడు మృతి చెందాడు. హదీ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అతడి హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే ఈ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం హస్తం ఉందని హదీ సోదరుడు ఆరోపించాడు. ఈ హత్య ఘటనపై వెంటనే విచారణ జరిపి హంతకులను పట్టుకోవాలని కోరాడు. హదీకి న్యాయం చేయకపోతే మీరు కూడా (యూనస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించాడు.

 
బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ (27) అనే హిందూ యువకుడిని ఇటీవల హత్య చేయడం సంచలనం రేపింది. అతడు ముస్లిం మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడనే ఆరోపణలతో అక్కడి స్థానికులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఓ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

అవామీ లీగ్ పార్టీపై నిషేధం

యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా యూనస్ ప్రభుత్వం.. అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధికారికంగా ధృవీకరించింది. 

Advertisment
తాజా కథనాలు