/rtv/media/media_files/2025/09/13/trump-letter-2025-09-13-21-21-08.jpg)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలకు సంచలన అల్టిమేటం జారీ చేశారు. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అందుకు నాటో సభ్యదేశాలు కొన్ని షరతులను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటో దేశాల అధినేతలకు ఒక లేఖ రాశారు. దానిని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా పంచుకున్నారు.
Trump also proposes new 50-100% NATO tariff on China but not India
— Shashank Mattoo (@MattooShashank) September 13, 2025
Trump says he will expand sanctions on Russia only when NATO countries stop buying oil from Russia pic.twitter.com/GMXqwTmBnL
ఆయన లేఖలో ప్రధానంగా రెండు కీలకమైన డిమాండ్లను ప్రస్తావించారు. మొదటిది, అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వెంటనే ఆపివేయాలి. రెండవది, చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు (టారిఫ్‌లు) విధించాలి. చైనాపై 50 నుంచి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించాలని ఆయన సూచించారు. ఈ టారిఫ్‌లు ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు కొనసాగాలని, ఆ తర్వాత శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే వాటిని ఉపసంహరించుకోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన వెనుక ఉన్న తన ఆలోచనను ట్రంప్ వివరించారు. చైనాకు రష్యాపై బలమైన పట్టు ఉందని, ఈ టారిఫ్‌లు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని, ఇది యుద్ధం త్వరగా ముగియడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా ఉందని, యుద్ధంలో విజయం సాధించడానికి నాటో నిబద్ధత 100 శాతం కంటే చాలా తక్కువగా ఉందని ఆయన విమర్శించారు.
ఈ యుద్ధం మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల వల్ల వచ్చిందని ట్రంప్ మరోసారి ఆరోపించారు. తాను కేవలం యుద్ధాన్ని ఆపి, వేలాది మంది రష్యా, ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. నాటో దేశాలు తన ప్రతిపాదనలకు సహకరిస్తే రష్యాపై ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తేల్చి చెప్పారు. తన చర్యల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, చర్చలకు దిగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.