/rtv/media/media_files/2026/01/04/fotojet-78-2026-01-04-11-10-54.jpg)
Tea that caused economic loss to Pakistan
Pakistan : సాధారణంగా ఇద్దరు స్నేహితులు కలిస్తే కాఫీ లేదా టీ ఆర్డర్ చేస్తాం. ఇంటికి బంధువులు వచ్చినా ఛాయ్ పోయాల్సిందే. ఇక ఏదైనా చిన్న మీటింగ్ ఉన్నా టీ సర్వ్ చేయాల్సిందే. ఇది మనకు పెద్ద విషయం ఏం కాకపోవచ్చు. కానీ, ఆ ఛాయ్‌నే పాకిస్థాన్ కొంపముంచింది. అవును, మీరు చదువుతున్నది అక్షరాల నిజం. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఉన్న ఛాయ్ అలవాటే దానికి కారణమని....పాకిస్థానీయులకు ఉన్న ఛాయ్ అలవాటు మూలంగా ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైంది.. అలాగే చక్కెర ఎక్కువగా వాడటం మూలంగా వారికి షుగర్ వచ్చింది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడటం మొదలు పెట్టిందట.
పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్..ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్‌తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్‌కు నిత్యం దిగుమతి అవుతుంటుంది. తేయాకును పండించే వాతావరణం పాక్‌లో లేకపోవడంతో.. ఛాయ్ పొడిని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే. దీనికోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్‌ను వినియోగిస్తుంటడట..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతున్నాడటన్న మాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున ఒక వ్యక్తి 60 గ్రాముల పంచదారను వినియోగిస్తున్నాడన్నారు.
పాకిస్థాన్ రికార్డుల ప్రకారం అక్కడ1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగవుతుంది. కానీ, గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి చెప్పుకోదగ్గ స్థితిలో లేదు. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది..! ఛాయ్‌తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్‌లలో, సోడాలు తదితరాల్లో చక్కెర అవసరం. ఎలాంటి సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీలకు ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తున్నాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్‌కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్‌లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్‌లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని దీనివల్లే కోల్పోతోందంటే. పరిస్థితి. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఇక పాకిస్థాన్‌లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. అక్రమ మార్గాల ద్వారా అక్కడి వారు టీపొడి, చక్కెర తరలిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయని వెల్లడయింది. పాకిస్థాన్ మొహంజోదారోలో సింధూ నాగరికత ఆనవాళ్లు ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది.
Follow Us