Pak-Afghan: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్..ప్రకటించిన టర్కీ

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మరో వారం పాటూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  నవంబర్ 6న ఇస్తాంబుల్ లో ఇరు దేశాలు మళ్ళీ సమావేశమవుతాయని చెప్పింది.

New Update
pak-afghan (3)

ఇస్తాంబుల్ లో జరిగిన చర్చలు మొత్తానికి ఫలితాన్ని ఇచ్చాయి. ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు కాల్పుల విరమణను మరో వారం పాటూ పొడిగించడానికి అంగీకరించాయని టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్ 6న ఇస్తాంబుల్ లో ఇరు దేశాలు మళ్ళీ సమావేశమవుతాయని చెప్పింది. శాంతి పరిరక్షణ నిర్థారించే లేదా ఉల్లంఘించే వారిపై జరిమానా విధించే పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పార్టీలు అంగీకరించాయని తెలిపింది. 

రెండో రౌండ్ చర్చలు విఫలం..

అంతకు ముందు టర్కీ వేదికగా అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు  ప్రకటించాయి. ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేకపోవడమే కాక..నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నాయి.  దీంతో త్వరలోనే పాక్, ఆఫ్ఘాన్ ల మధ్య మళ్ళీ యుద్ధం జరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. పాక్‌పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించబోమన్న హామీ ఇవ్వడం సహా 'తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్లను' అఫ్గన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కానీ ఆఫ్ఘాన్ మాత్రం తాము అన్ని రకాల ప్రయత్నాలను చేశామని చెప్పింది.

దాదాపు పది రోజులు పాక్, ఆఫ్ఘాన్‌లు ఎడతెగని దాడులు చేసుకున్నాయి. అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు తాలిబన్లు డజన్ల కొద్దీ మరణించారు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ క్రికెటర్లు ముగ్గురిని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. దీంతో ఖతార్, టర్కీ వంటి దేశాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. తన వరకు వస్తే యుద్ధాన్ని కచ్చితంగా ఆపుతానని చెప్పారు. అయితే ఈ లోపునే ఖతార్, టర్కీల సమక్షంలో పాక్, ఆఫ్ఘన్‌లు కాల్పులు విరమణ ఒప్పదం చేసుకున్నాయి. కాబూల్ రక్షణ మంత్రి ముహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలపై చర్చించారు.  

Advertisment
తాజా కథనాలు