Nepal Protests : నేపాల్‌లో తిరిగి రాచరిక పాలన? ఆ ఫోటో వెనుక సంకేతం అదేనా?

నేపాల్‌లో నెలకొన్న ఆందోళనలు ఆ దేశ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యాయి. సోషల్‌ మీడియా పై నిషేధంతో ప్రారంభమైన జెన్‌జెడ్‌ ఉద్యమం చిలికిచిలికి గాలివానలా మారి హింసాత్మకంగా మారింది. అయితే అక్కడి ప్రజలు తిరిగి రాచరిక పాలన కోరుకుంటున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.

New Update
Nepal Protests

Nepal Protests

Nepal Protests : నేపాల్‌లో నెలకొన్న ఆందోళనలు ఆ దేశ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యాయి. సోషల్‌ మీడియా పై నిషేధంతో ప్రారంభమైన జెన్‌జెడ్‌ ఉద్యమం చిలికిచిలికి గాలివానలా మారి హింసాత్మకంగా మారింది. ప్రజల ఆందోళనతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగలేదు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలని నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్‌ పిలుపునిచ్చారు.  అయితే నేపాల్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసగిస్తున్న సమయంలో ఆయన వెనుక దర్శనమిచ్చిన ఒక ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఆ ఫోటో ద్వారానే దేశంలో శాంతి నెలకొల్పాలని ఆర్మీ చీఫ్‌ ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకి ఆ ఫోటో ఎవరిదంటే? 18వ శతాబ్దానికి చెందిన రాజు పృథ్వీ నారాయణ్ షాది.  నేపాల్‌ను చివరగా పాలించినది ‘షా’ రాజవంశమే . నేపాల్‌ మావోయిస్టుల తిరుగుబాటుతో 2008లో జ్ఞానేంద్ర షా గద్దె దిగిపోయారు. దీంతో ఈ హిందూ వంశపాలన ముగిసినట్లయింది. దాదాపు రెండున్నర శతాబ్దాల పరిపాలన అంతమై.. ప్రజాస్వామ్య రాజ్యం అవతరించింది. కానీ, ఏం లాభం..ఈ 17 ఏళ్ల కాలంలో దేశంలో 14 సార్లు ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత, ప్రభుత్వాల అవినీతి, బంధుప్రీతితో ప్రభుత్వాలు కూలుతున్నాయి. తాజాగా మరోసారి సంక్షోభం ఏర్పడింది.

నేపాల్ రాచరిక పాలనకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1769 నుంచి 2008 వరకు అంటే దాదాపు 240 ఏళ్ల పాటు షా రాజవంశీయులు నేపాల్‌ను ఏకధాటిగా పరిపాలించారు. రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడాలని 1990లో ప్రజలు ఉద్యమించారు. దానికి నాటి రాజు బీరేంద్ర అంగీకరించారు. అయితే 2001లో జరిగిన ఓ సంఘటన నేపాల్‌లో రాచరిక అంతానికి కారణమైంది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరిమణులను అందరినీ చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా రాజుగా సింహాసనాన్ని అధీష్టించారు. అనంతరం 2005లో జ్ఞానేంద్ర నిరంకుశంగా పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. దీన్ని నేపాలీలు వ్యతిరేకించారు. దీంతో మళ్లీ 2006లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. కానీ, ఆందోళనలు ఆగలేదు. ఈ క్రమంలో 2008లో రాచరికం పూర్తిగా రద్దయి లౌకిక, గణతంత్ర రాజ్యంగా నేపాల్‌ అవతరించింది.

కానీ, రాచరికం రద్దయ్యాక 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి. ఇటీవల కాఠ్‌మాండూలో హింసాత్మక ఘటనలు చెల రేగాయి. ఆ ఘటనలో ఇద్దరు పౌరులు చనిపోగా, 77 మంది భద్రతా సిబ్బంది సహా 110 మంది గాయపడ్డారు. దీనికి మాజీ రాజు జ్ఞానేంద్ర షా కారణమని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. ఆ ఘటనను తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే జ్ఞానేంద్ర షా ప్రజల మధ్య విభేదాలు తీసుకొస్తున్నారని ఆరోపించారు.  దీంతో  జ్ఞానేంద్ర షా భద్రతను నేపాల్ ప్రభుత్వం కుదించింది. ఆయనకున్న భద్రతా సిబ్బందిని 25 మంది నుంచి 16కు తగ్గించింది. కాఠ్‌మాండ్‌లో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందుకు జ్ఞానేంద్ర షాకు ఆ నగర మున్సిపల్‌ అధికారులు 5వేల 900 డాలర్ల జరిమానా కూడా విధించారు.

రాజరికమే బెస్ట్​

ఇదిలాఉంటే.. ఈ ఏడాది మొదట్లో రాచరిక పాలనకు మద్దతుగా నేపాల్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఆ దేశంలో రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఆ ర్యాలీని నిర్వహించింది. నేపాల్‌లో రాజు పాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆసందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోను ప్రదర్శించారు. అదే ర్యాలీలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చిత్రాలను కూడా ప్రదర్శించడం గమనార్హం. మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇతర దేశ నాయకుల చిత్రాలను ప్రదర్శించినందుకు అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కాగా.. అస్థిరపాలనపై నిరసన వ్యక్తమవుతుండటంతో జ్ఞానేంద్ర తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దాంతోనే ఈ రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుందని తెలుస్తోంది. రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయం సమృద్ధిగా ఉండేదని నిరసనకారులు అంటున్నారు.  

దాంతో రాచరికం పునరాగమనంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ తరుణంలోనే ఆర్మీ చీఫ్‌ వెనుక ఆ చిత్రం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది రాచరికానికి సంకేతమా..? త్వరలో నేపాల్‌కు హిందూ రాజుల పాలన తిరిగి రాబోతుందా..? అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నేపాలీస్‌ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేకస్థానం ఉంది. గోర్ఖా ప్రిన్సిపాలిటీలో జన్మించిన నారాయణ్ షా 20 ఏళ్ల వయసులో నేపాల్‌లో అధికారాన్ని చేపట్టారు. ఆధునిక నేపాల్ రూపశిల్పిగా ఆయన పేరు గాంచారు. ఆర్మీకి చెందిన ఎన్నో కార్యక్రమాలు, సంస్థలు, కొన్ని మౌలిక సదుపాయాలు  అన్ని ఆయన పేరు మీదే ఉంటాయి. ఈ సిగ్దెల్ గత ఏడాది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇలాంటిదే మరో చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించింది. అయితే మళ్లీ ఇది కనిపించడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో  రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా

Advertisment
తాజా కథనాలు