UNOలో పాక్ ఆర్మీ నేర చరిత్ర.. ‘వేలాది మహిళలపై అఘాయిత్యాలు’

UNO సమావేశంలో బుధవారం భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ మాట్లాడారు. పాకిస్థాన్‌లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్‌లో వేలాది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు.

New Update
Eldos Mathew Punnus

Eldos Mathew Punnoose

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ పాకిస్తాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ఆరోపణలు చేయడం వంటి పాకిస్తాన్ దుశ్చర్యలను ఆయన ఎండగట్టారు. ప్రపంచ శాంతికి, భద్రతకు పాకిస్తాన్ ఒక ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం UNO సమావేశంలో భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ ఇండియా తరుపు మాట్లాడారు. పాకిస్థాన్‌లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు పాకిస్థాన్‌లో వేలాది మంది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు. ఆ దురాగతాలు నేటికీ కొనసాగుతున్నాయని ఐరాస వేదికగా భారత్ మండిపడింది.

‘1971లో మునుపటి తూర్పు పాకిస్థాన్‌( ప్రస్తుతం బంగ్లాదేశ్)లో వేలాది మంది మైనారిటీ వర్గాల మహిళలపై దారుణమైన లైంగిక హింసకు పాల్పడిన చరిత్ర పాక్‌ సైన్యానిది. అయినప్పటికీ నిందితులపై ఎటువంటి శిక్షలు విధించకపోవడం సిగ్గుచేటు. అటువంటి దుర్భర పరిస్థితి నేటికీ పాక్‌లో కొనసాగుతోంది. మహిళల అపహరణ, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లైంగిక హింస, బలహీన వర్గాల మహిళ బలవంతపు మతమార్పిడిలు, బాలికలపై వేధింపులకు సంబంధించి UNO మానవ హక్కుల కమిషన్‌‌తోపాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికల్లో వివరించాయి’ అని ఐరాసలో భారత రాయబారి ఎల్డోస్‌ మాథ్యూ పున్నూస్‌ వెల్లడించారు.

పున్నూస్ తన ప్రసంగంలో జమ్మూ మరియు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఖండించారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, ఇది గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఆయన గట్టిగా చెప్పారు. భారతదేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ, ఆ దేశం ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుందని పున్నూస్ ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో అనేక దాడులకు పాల్పడ్డాయని, అందులో పార్లమెంటుపై జరిగిన దాడి కూడా ఉందని గుర్తుచేశారు. సాధారణ భారతీయ పౌరులు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు బాధితులుగా మారారని ఆయన అన్నారు.

పాకిస్తాన్ యొక్క ప్రజాస్వామ్య రికార్డుపై పున్నూస్ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశంలో జరిగిన ఎన్నికలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తున్నాయని, కానీ పాకిస్తాన్‌లో మాత్రం తప్పుడు ఎన్నికలు, ప్రతిపక్ష నాయకుల అణచివేత, రాజకీయ గొంతులను నొక్కడం సర్వసాధారణమని అన్నారు. ఇటీవల జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికలలో మిలియన్ల మంది ఓటర్లు పాల్గొని తమ నాయకులను ఎన్నుకోవడం పాకిస్తాన్‌కు ఒక షాకింగ్‌గా అనిపించి ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో పాకిస్తాన్‌కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు