/rtv/media/media_files/2025/10/03/modi-putin-2025-10-03-06-36-43.jpg)
రష్యా, భారత్ చమరు వాణిజ్యంపై అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్పందించారు. ఈ విషయంలో ఇండియాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. చమురు దిగుమతులు ఆపేయాలంటూ అమెరికా తెస్తున్న ఒత్తిడి సరైనది కాదని పుతిన్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనపై ఆయన విరుచుకుపడ్డారు. భారతదేశం ఎలాంటి ఒత్తిడికి తలొగ్గదని...వారు అవమానాలను సహించరని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యా ఎప్పటికీ భారత్ కు మద్దతుగా ఉంటుందని చెప్పారు. భారత్ తో సహా 140 దేశాల భద్రతా, భౌగోళిక, రాజకీయ నిపుణుల అంతర్జాతీయ వాల్డాయ్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే..అది మొత్తం ప్రపంచానికే నష్టమని పుతిన్ అన్నారు. దాని కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయని చెప్పారు. అధిక సుంకాల వలన అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుందని...వారి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని పుతిన్ హెచ్చరించారు.
మోదీ చాలా తెలివైన వారు..
దీంతో పాటూ పుతిన్ భారత్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఆ దేశంతో తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదని అన్నారు. డిసెంబర్ లో తాను చేయబోయే భారత్ పర్యటకు ఎదురు చూస్తున్నానని పుతిన్ అన్నారు. భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని ఆయన తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారత్..రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం మానేస్తే...9 బిలియన్ల నుంచి 10 బిలియన్ల మధ్య నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. భారత ప్రధాని మోదీ మీద తనకు అపార నమ్మకముందని...ఆయన నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలించి తీసుకుంటారని పుతిన్ చెప్పారు. మోదీ తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు. అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే నష్టాలను రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి, రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను కొనుగోలు చేస్తుందని వివరించారు.
అమెరికా దొంగ వేషాలు వేస్తోంది..
మరోవైపు అమెరికాను పుతిన్ తీవ్రంగా విమర్శించారు. భారత్ కు అన్నీ అడ్డంకులు పెడుతున్న ఆ దేశం తానే స్వయంగా మాస్కో నుంచి అన్నీ కొనుగోలు చేస్తోందని తెలిపారు. వారికి ఒక న్యాయం...ఇతరులకు మరొక న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు. అణు విద్యుత్ ప్లాంట్లను ఉపయోగిస్తున్న అతిపెద్ద దేశాల్లో అమెరికా ఒకటని చెప్పారు. అమెరికాలో అణుశక్తి బాగా అభివృద్ధి చెందినందున, దానికి పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం ఉంటుంది. దాని కోసం రష్యానుంచి ఆ దేశం అధిక మొత్తంలో యురేనియం కొనుగోలు చేస్తోందని పుతిన్ తెలిపారు.