/rtv/media/media_files/2025/08/14/trump-putin-talks-2025-08-14-20-53-32.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ల మధ్య జరిగే అత్యంత కీలకమైన సమావేశానికి అలస్కా వేదిక కానుంది. అలాగే ఈ సమావేశం భారత్‌పై కూడా ప్రభావం చూపనుందని అమెరికా చేసిన హెచ్చరికలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం ఆగస్టు 15న ఈ ఇద్దరు అగ్రనేతలు భేటీ కానున్నారు. ఈ సమాచారాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరగడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ భేటీ తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఇలా రష్యా అధ్యక్షుడు ప్రపంచ దేశాల రాజకీయాల్లో కీలకంగా మారాారు. మరికొన్ని రోజుల్లో పుతిన్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవ్వనున్నారు.
ట్రంప్, పుతిన్ భేటీ
ప్రస్తుతం ట్రంప్, పుతిన్ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధానికి(Ukraine War) ముగింపు పలకడం ప్రధాన ఎజెండాగా ఉంది. ఉక్రెయిన్, రష్యా మధ్య భూభాగాలను మార్చుకోవడం ద్వారా శాంతిని సాధించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఈ ఆలోచన వివాదాస్పదంగా మారగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దీనిని తిరస్కరించారు. తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ ఈ భేటీని "విషయాలను అంచనా వేయడానికి" ఒక అవకాశంగా చూస్తున్నారు. ఈ సమావేశం తర్వాత పుతిన్, జెలెన్స్కీలతో త్రైపాక్షిక భేటీని నిర్వహించాలని కూడా ట్రంప్ యోచిస్తున్నారు.
అలస్కాలోనే ఎందుకంటే..
ఈ సమావేశానికి అలస్కాను ఎంపిక చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అలస్కా అమెరికా భూభాగమైనప్పటికీ, రష్యాకు చాలా దగ్గరగా ఉండటంతో ఇరు దేశాలకు సౌకర్యవంతంగా ఉంది. అంతేకాకుండా, 1867లో రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసిన ప్రాంతం కావడంతో దీనికి ఒక చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఈ భేటీ కోసం జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్‌ను నిఘా పెట్టేందుకు కీలక పాత్ర పోషించింది. అలాంటి ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఈ భేటీ జరగడం గమనార్హం.
Also Read : పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం .. ముగ్గురు మృతి!
భేేటీ బెదిసికొడితే భారత్‌కు దెబ్బ
ఈ సమావేశం సత్ఫలితాలు ఇవ్వకపోతే భారత్‌పై మరిన్ని సుంకాలు విధించాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తున్నందున ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించారు. 25 శాతంగా ఉన్న సుంకాలు 50శాతానికి పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అమెరికా, రష్యా చర్చలు విఫలమైతే మరిన్ని ఆంక్షలు తప్పవని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ సమావేశంపై భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. "ఇది యుద్ధాల శకం కాదు" అనే ప్రధాని నరేంద్ర మోడీ విధానానికి ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయని పేర్కొంటూ స్వాగతించింది. మొత్తంగా, ఈ భేటీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.